Local-Elections-in-Andhra-Pradesh-Put-On-Holdఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షం భయపడిందే జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఆపకూడదని కరోనా వైరస్ పట్ల ఇప్పటివరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు అక్కడి ప్రభుత్వం. దేశంలోని అన్ని రాష్ట్రాలు గుంపులుగా ఉండే చోట్లపై నిషేధం విధిస్తుంటే ఏపీ గవర్నమెంట్ మాత్రం ఆ పని చెయ్యలేదు.

అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం కలుగజేసుకుని ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల పాటు నిలిపివేసింది. ఆరు వారాల తర్వాత పరిస్థితిని సమీక్షించి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. ఇప్పటి వరకూ ఏకగ్రీవమైన స్థానాల్లో ఎన్నికలు ఉండవని ఆయన తెలిపారు.

అయితే ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఎన్నికల ప్రక్రియ తాత్కాలింగా వాయిదా వేయడం కాదని.. మొత్తం ప్రక్రియ మొదటి నుంచి చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏకగ్రీవాలు అన్ని అధికార పక్షం దౌర్జన్యంతో సాధించిందని వాటిని రద్దు చేసి కఠిన నిబంధనల మధ్య ఎన్నికల ప్రక్రియను సజావుగా జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా 652 జెడ్పీటీసీ స్థానాల్లో 125 స్థానాలలో, ఎంపీటీసీ స్థానాల్లో 2000 పైగా వైఎస్సార్ కాంగ్రెస్ ఏకగ్రీవాలు నమోదు చేసిందని ఆ పార్టీ పత్రిక సాక్షి ఈరోజు ఒక కథనం ప్రచురించింది. అయితే ఇవన్నీ ప్రత్యర్థులను నామినేషన్లు వెయ్యనివ్వకుండా, వేసిన చోట్ల తమ అధికారంతో వాటిని చెల్లనివ్వకుండా, వేసిన వారిని బెదిరించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చెయ్యడం ద్వారా సాధించినవని ఆరోపణలు ఉన్నాయి.