varun tej loaferదర్శకుడిగా పూరీ జగన్నాధ్ తన స్థాయిని దిగజార్చుకుంటున్నారా? “లోఫర్” చిత్ర కలెక్షన్స్ ను పరిశీలిస్తే ఇదే రకమైన అభిప్రాయాలను ట్రేడ్ విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నారు. ఏపీ, తెలంగాణాలలో ఎలా ఉన్నా, ఓవర్సీస్ లో మాత్రం ‘లోఫర్’ తీవ్రస్థాయిలో నిరుత్సాహ పరిచిందని టాక్. దాదాపు 32 లొకేషన్స్ లలో ప్రదర్శితమైన ప్రీమియర్ షోలకు కేవలం 11,012 డాలర్స్ ను మాత్రమే వసూలు చేయడం విస్మయం కలిగించే అంశం. నాని నటించిన “భలే భలే మగాడివోయ్” సినిమా ప్రీమియర్స్ కు ఇంతకు మూడింతలు కలెక్షన్స్ రావడం పరిశీలించదగ్గ విషయమే.

హీరోగా వరుణ్ తేజ్ నటించిన మూడవ సినిమానే కావడంతో ఈ కలెక్షన్ల ప్రభావం వరుణ్ పై పెద్దగా పడకపోవచ్చు గానీ, టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న పూరీ స్థాయికి ఈ కలెక్షన్స్ ఏ మాత్రం సరితూగడం లేదని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. 2015 తొలిభాగంలో పూరీ దర్శకత్వం వహించిన ‘టెంపర్’ చిత్రానికి ఓవర్సీస్ లో వసూలు బాగానే ఉన్నాయి. అయితే తదుపరి చిత్రం ‘జ్యోతిలక్ష్మి’ దారుణ పరాజయాన్ని చవిచూసింది. దీనికి తోడు మెగా వారసుడ్ని పెట్టుకుని కూడా ‘లోఫర్’కు సరైన పబ్లిసిటీని ఇవ్వడంలో చిత్ర యూనిట్ లోపించింది. ఈ పరిణామాలన్నీ ‘లోఫర్’ కలెక్షన్స్ పై పడ్డాయని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.