Liquor relaxation may spike coronavirus casesభారత్ దేశం మొత్తంలో 40 రోజులకు పైగా మద్య నిషేధం అమలయ్యింది. కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని షాపులతో పాటు వైన్ షాపులు కూడా మూసేయాల్సి వచ్చింది. అక్కడక్కడా కొన్ని చోట్ల తప్ప ప్రజలు చాలా వరకూ మద్యం తాగకపోయినా బానే ఉన్నారు. రోజు ఒక క్వార్టర్ వేసే వారు కూడా బానే నిగ్రహించుకున్నారు.

కొన్ని చోట్ల కొంత మంది ఆసుపత్రులలో చేరారు. అయితే ఆ సంఖ్య ఎక్కువేమీ కాదు. ఇన్ని రోజులు మద్యం తాగకుండా తమను తాము నిగ్రహించుకోగలమని మందుబాబులు నిరూపించారు. అయితే ప్రభుత్వాలు మాత్రం ఈ విషయంలో ఓడిపోయాయి. మీరు తాగకుండా ఉండగలరేమో గానీ మీరు తాగకపోతే మేము ఉండలేము అని స్పష్టం చేసేశాయి.

దేశవ్యాప్తంగా వైన్ షాపులు తెరుచుకున్నాయి. దేశంలోనే అత్యధిక కేసులు ఉన్న మహారాష్ట్ర కూడా షాపులను తెరిచేసింది. కిలోమీటర్ల మేర లైన్లలో మందుబాబులు తమను తాము మర్చిపోయి.. కరోనాని కూడా లెక్క చెయ్యకుండా తమ పెగ్గు కోసం ఎగబడ్డారు. అందులో ఎంతమంది తమ ఇళ్లకు క్వార్టర్ తో పాటు కరోనాని కూడా తీసుకుని వెళ్లారో తెలీదు.

ప్రజల ఆరోగ్యమే ముఖ్యం అంటూ లెక్చర్లు ఇచ్చిన కేసీఆర్ వంటి వారు కూడా చేతులు ఎత్తేసి మద్యం షాపులు షూటర్లు తీశారు. దీనితో మద్యం మహమ్మారి పై ప్రజలు గెలిచినా, ప్రభుత్వాలు ఓడిపోయాయి. ప్రభుత్వాలు ఇప్పుడు ప్రజలను కూడా ముంచకపోతే చాలు అనుకోవాలి అంతే.

నిధులు లేకపోతే ఓట్ల వేటలో వెనుకబడిపోతాం అని షాపులు తెరిచినా.. ఒక చేతి తో ఇచ్చి ఇంకో చేతితో మద్యం పేరుతో లాగేసుకుంటున్నారు అని నిషాలోకి జారిపోయిన ఆ ప్రబుద్దుడికి తెలీదు. ఇందులో మనం చేసేది ఏముంది? ప్రజాస్వామ్యం వర్ధిలాలి… అని ముందుకు వెళ్లిపోవడమే.