liquor ban in andhra pradesh benefits telangana governmentఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం అంటూ అక్కడి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే, తెలంగాణాలో మాత్రం మద్యం ఏరులైపారుతుంది. అక్టోబరు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నూతన ఆబ్కారీ విధానంతో రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటైన నేపథ్యంలో వాటికి తగ్గట్టుగా దుకాణాల సంఖ్య పెంచాలని భావిస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలోనూ కనీసం ఒక మద్యం దుకాణం ఉండేలా చూడాలనే విధానాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

జిల్లాల, మండలాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 125 మండలాలు ఏర్పడ్డాయి. వీటిలో దాదాపు సగం వరకూ మండల కేంద్రాల్లో దుకాణాలు లేవు. ఇప్పుడు ఆయాచోట్ల ఏర్పాటుకు అవకాశం ఇవ్వడంతోపాటు డిమాండును బట్టి మిగతా మండల కేంద్రాలకూ మరికొన్ని ఇవ్వాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2216 వైన్‌ దుకాణాలు, 670 వరకూ బార్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న మద్య విధానం 2017లో అమలు లోకి వచ్చింది. దాని గడువు సెప్టెంబరు నెలతో ముగిసిపోనుంది.

అక్టోబరు 1వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి రాబోతోంది. ఇది కూడా రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో మద్యం రేట్లు పెంచబోతున్నారనే సమాచారం రావడంతో తెలంగాణాలో పెంచకూడదని ప్రభుత్వం భావిస్తుంది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలలోని షాపులలో డిమాండ్ పెరగవచ్చని భావిస్తున్నారు. జిల్లా బోర్డర్ దాటి వచ్చి మద్యప్రియులు తెలంగాణ షాపులలో కొనుగోలు చేస్తారని తెలంగాణ ప్రభుత్వం నమ్మకం. అటువంటి షాపులకు డిమాండ్ కూడా ఎక్కువ ఉండవచ్చని భావిస్తున్నారు ఈసారి.