liquor and non veg caught in tirumala tirupati
కలియుగ వైకుంఠం తిరుమలలో మద్యం, మాంసం నిషిద్ధం. అయినా తరచూ తిరుమలకి మద్యం, మాంసం తరలిస్తూ పలువురు పట్టుబడటం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా…. మీడియా పేరు చెప్పి తిరుపతి నుంచి తిరుమలకు మద్యం, మాంసం తరలిస్తున్న వ్యక్తిని అలిపిరి విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

తిరుమలలో గతంలో మీడియాలో పనిచేసిన ఎన్ వెంకటముని ఇండికా వాహనంలో మద్యం, మాంసం దాచిపెట్టి తిరుమలకు తరలిస్తున్నాడు. అలిపిరి తనిఖీ కేంద్రంలో ఏవీఎస్ వో సురేంద్ర ఆధ్వర్యంలో విజిలెన్స్ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

దీంతో వాహనంలోని సీట్ కింది భాగంలో దాచిన మద్యం, మాంసం గుర్తించి తిరుమల టూటౌన్ పోలీసులకు అప్పగించారు. వెంకటముని మద్యం, మాంసం తిరుమలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నట్టు ప్రాథమిక సమాచారం. తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలలో దాదాపుగా రెండు నెలల నుండి భక్తులకు ప్రవేశం లేదు.

కేవలం అర్చకులు మాత్రమే స్వామి వారికి అన్ని కైంకర్యాలు చేస్తున్నారు. ఇటీవలే అధికారులు, ఉద్యోగులు తిరిగి విధులలో చేరారు. ఈ క్రమంలో మద్యం మాంసం తరలించడం అంటే… అది ఖచ్చితంగా తిరుమలలో పని చేసే వారి కోసమే. ఈ విషయంపై టీటీడీ లోతుగా విచారణ జరిగి కలుపుమొక్కలు ఏరి పడెయ్యాలి.