Lipstick Under My Burkha Box Officeవిడుదలకు ముందు ఎంతో వివాదాన్ని రేపిన “లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా” సినిమా గత శుక్రవారం నాడు విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే ప్రేక్షకుల నుండి కూడా పాజిటివ్ మౌత్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలను షాక్ కు గురి చేస్తున్నాయి. సాధారణంగా రోజులు గడుస్తున్న కొద్దీ ఏ సినిమా కలెక్షన్స్ అయినా తగ్గుముఖం పడుతుంటాయి. కానీ, “లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా” సినిమాకు మాత్రం డౌన్ ట్రెండ్ కాకుండా అప్ ట్రెండ్ లో కొనసాగడం విశేషం.

గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి రోజు 1.22 కోట్లు సాధించగా, రెండవ రోజు 2.17 కోట్లు, ఆదివారం నాడు 2.41 కోట్లు అందుకుని వీకెండ్ ను ముగించింది. సినిమా హిట్టో, ఫట్టో తెలుసుకోవడానికి కొలమానంగా మారిన మండే టెస్ట్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది. మొదటి రోజు (1.22 కోట్లు) సాధించిన దాని కంటే సోమవారం నాడు 1.28 కోట్లు వసూలు చేసి, బాక్సాఫీస్ వద్ద విజయపు జెండా ఎగురవేసింది. దానికి మించిన మరో విశేషం ఏమిటంటే… మండేను మించిన స్థాయిలో మంగళవారం నాడు 1.36 కోట్లు సాధించడం..!

మొత్తమ్మీద తొలి అయిదు రోజులకు 8.44 కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ వద్ద “లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా” పెద్ద విజయాన్ని అందుకుంది. మహిళల చుట్టూ తిరిగే కధంశాలకు బాలీవుడ్ ప్రేక్షకులు ఇస్తోన్న విశేష ఆదరణకు మరో నిదర్శనం ఇది. గతంలో రాధిక ఆప్టే న్యూడ్ గా నటించిన “పార్చేడ్” సినిమాను కూడా బాలీవుడ్ ప్రేక్షకులు నీరాజనం పలికిన విషయం తెలిసిందే. బహుశా మున్ముందు ఈ తరహా సినిమాలు ఎక్కువగా నిర్మాణం అవుతాయని చెప్పడంలో సందేహం లేదు.