Like this district announcement like that power cut announcementరాష్ట్రంలోని జిల్లాల పెంపు అమలుకు నోచుకుంటుందా? లేదా? అన్నది పక్కన పెడితే, జగన్ సర్కార్ చేసిన ప్రకటన మాత్రం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అందులో భాగంగానే ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కొలువై ఉన్న ఏలూరును ఓ కొత్త జిల్లాగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇలా సరికొత్త జిల్లాగా ప్రకటించారో లేదో అలా ఏలూరుకు తీరని అవమానం జరిగింది.

ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేయడం కొత్త జిల్లా ప్రకటనకు తీరని అవమానంగా మారింది. కార్పొరేషన్ పరిధిలో ఉన్న వీధి లైట్లు మరియు తాగునీటికి సంబంధించిన బకాయిలు కోట్లల్లో పేరుకు పోవడం, నోటీసులు అందించినా అధికారులు స్పందించక పోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

స్థానిక సమస్యలపై ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదని చెప్పడానికి ఇదొక నిదర్శనం మాత్రమే. గతంలో అనంతపురం జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. జగన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో కార్పొరేషన్లు ఉన్నాయా? ఇలా కోట్లకు కోట్లు బకాయిలు పేర్చుకుంటూ పోతే కార్పొరేషన్లకు విలువ ఉంటుందా?

ఆ మాటకొస్తే కార్పొరేషన్ పరిధిలో వస్తోన్న ఆదాయం అంతా ఎక్కడికి వెళ్తోంది? అన్న ప్రశ్న మొదటగా ఉత్పన్నం అవుతోంది. వీధి లైట్లు, తాగునీరు అనేవి నిత్యావసర పరిధిలోకి వస్తాయి, కనీసం వాటికి చెల్లించాల్సిన బిల్లులు కూడా చెల్లించకుండా అధికారులు ఏం చేస్తున్నట్లు? అంత అలసత్వం వహిస్తోన్న అధికారులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?

ఇలా అనేకానేక ప్రశ్నలు తలెత్తడం సహజం. ఇవాళ ఏలూరు కార్పొరేషన్ కే చెందినది కావచ్చు, రేపు మీ పరిధిలో ఉన్న కార్పొరేషన్ వీధి దీపాలు వెలుగకపోయినా, నీటి కుళాయిలు రాకపోయినా కారణం ఇదే కావచ్చు. ఎందుకంటే కార్పొరేషన్ల నిధులు కూడా పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలను జగన్ సర్కార్ ఇప్పటికే ప్రతిపక్షాల నుండి ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిణామాలు ఆ విమర్శలకు బలాన్నిచ్చే విధంగా మారుతున్నాయి.