LG Polymers India Vizag Gas Leakageవిశాఖపట్నం గ్యాస్ లీక్ ఘటన ఇప్పటివరకూ పదకొండు మంది ప్రాణాలను బలితీసుకుంది. నిన్న రాత్రి కూడా ఆ ప్రాంతంలోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలోనే వారికి భారీగా నష్టపరిహారం ప్రకటించారు.

అయితే ఈ భారీ నష్టపరిహారం అసలు జరిగిన ఘోరం నుండి ప్రజల దృష్టి మళ్లించేదిగా ఉందని నిపుణులు అంటున్నారు. అసలు 2018లో టీడీపీ ప్రభుత్వం అనుమతులు నిరాకరించిన కంపెనీకి 2019 జులైలో ఎందుకు అనుమతులు ఇచ్చినట్టు? జరిగిన ఘటనలో కంపెనీ లోపాలు ఎంతమేర ఉన్నాయి?

పదకొండు మంది ప్రాణాలు పోవడానికి కారణమైన కంపెనీ ప్రతినిధులను ఎయిర్ పోర్టులోనే ముఖ్యమంత్రి ఎందుకు కలవాల్సి వచ్చింది? వారిపై పెట్టిన కేసులలో చిన్న చిన్న సెక్షన్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? లాక్ డౌన్ సమయంలో ప్లాస్టిక్ కంపెనీకి అనుమతిని ఇవ్వాల్సిన అవసరం ఏంటి?

నష్టపరిహారం కంపెనీ నుండి రాబడతామని గట్టిగా చెప్పకుండా మా తంటాలు మేము పడతాం అని బేలా మాటలు మాట్లాడటం ఏంటి? కంపెనీ నుండి ముక్కు పిండి వసూలు చేస్తామని చెప్పకుండా మేము మాట్లాడతాం అనడం ఏంటి? బాధిత కుటుంబాలకు అదే కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడం ఆ కంపెనీకి ధీమా కలిగించడం కదా?

ఇటువంటి అనేక ప్రశ్నలకు తావు లేకుండా భారీగా పారితోషికం ప్రకటించి అసలు విషయాన్ని మరుగునపరిచారు అంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోటి రూపాయిల మాటున అసలు విషయాలు చర్చకు రాకుండా చెయ్యడంలో ముఖ్యమంత్రి జగన్ సఫలీకృతం అయ్యారని వారు ఆక్షేపిస్తున్నారు.