Acharya -Radhe Shyamఆనాడు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు వంటివారు తెలుగు చిత్రసీమను తిరుగులేకుండా ఏలుతున్నరోజులలోనే సినిమా కధ నచ్చకపోతే ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరిస్తుండేవారు. ఆ ట్రెండ్ నేటికీ యదాతధంగా కొనసాగుతూనే ఉందని రాధే శ్యామ్, ఆచార్య మరోసారి నిరూపించాయి.

అయితే చిన్న హీరోలు చేసిన జాతిరత్నాలు, డీజే టిల్లు వంటి అనేక సినిమాలను ప్రేక్షకులకు మెప్పించేలా తీయడంతో సూపర్ హిట్ అయ్యాయి. కనుక సినిమాకు పెద్ద హీరోహీరోయిన్లు, భారీ సెటింగ్స్, విదేశాలలో పాటలు, కమర్షియల్ ఎలిమంట్స్ కంటే కధే ముఖ్యమని సినీ పరిశ్రమకు ఇవి మరోసారి గుర్తు చేసాయి.

ముఖ్యంగా తన సినిమాలను, రాజకీయ ప్రమోషన్ కూడా వాడుకొనేందుకు ప్రయత్నించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ వంటివారు మరింత జాగ్రత్తగా కధలను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. సినిమాలలో జనసేనను ప్రమోట్ చేసే డైలాగ్స్ అభిమానుల చేత చప్పట్లు కొట్టించవచ్చునేమో కానీ అవే సినిమాను నిలబెట్టవు…సరికదా ఆ చప్పట్లను ఓట్లుగా మార్చలేవు కూడా. గత ఎన్నికలలో ఓడిపోయిన తరువాత పవన్ కళ్యాణ్‌ ఇది స్వయంగా అంగీకరించారు కూడా. కనుక పవన్ కళ్యాణ్‌తో సహా పరిశ్రమలో పెద్ద హీరోలందరూ తమ సినిమాలో ‘రంగు, రుచి, చిక్కదనం’ ఉన్నాయో లేవో ముందుగానే చూసుకోవడం చాలా అవసరం.

కానీ పెద్ద సినిమాలు పడితే తిరిగి లేవడం కష్టం. అదృష్టవశాత్తు రూ.450 కోట్ల భారీ పెట్టుబడితో సుమారు నాలుగేళ్ళు కష్టపడిన తీసిన ఆర్ఆర్ఆర్ హిట్ అయ్యింది లేకుంటే…ఊహించు కోవడమే కష్టం!

ఇక కరోనా దెబ్బకు పెద్ద సినిమాలు సైతం షూటింగ్, రిలీజ్ చేసుకోలేక వాయిదావేసుకోవలసి వస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక మళ్ళీ ఆనాడు రెండు మూడు నెలలకో సినిమా పూర్తిచేసి వందరోజులు ఆడించుకొన్నట్లే, ఇప్పుడూ తక్కువ సమయంలో సినిమాను పూర్తిచేయడం చాలా అవసరం.

ఉదాహరణకు గొప్ప చారిత్రిక నేపద్యం, భారీ సెటింగ్స్, భారీ యాక్షన్ సన్నివేశాలున్న గౌతమీపుత్ర శాతకర్ణిని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కేవలం రూ.45 కోట్ల బడ్జెట్‌తో మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసి హిట్ కొట్టారు. అటువంటి క్లిష్టమైన కధాంశం కలిగిన సినిమాను ఇంత సమర్ధంగా, వేగంగా పూర్తిచేయగలిగినప్పుడు, అసలు కధే లేని సినిమాల కోసం వందల కోట్లు ఖర్చు చేయడం దేనికి? మళ్ళీ ఏళ్ళ తరబడి షూటింగ్ చేయడం దేనికి? అనే సందేహం కలుగక మానదు.

సినిమాలకు బెనిఫిట్ షోలు వేసుకొని టికెట్ ధరలు పెంచుకొంటే ఆ ఒక్క సినిమా బ్రతుకుతుందేమో కానీ సినీ పరిశ్రమ బ్రతకదు కనుక అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో వచ్చిన ఈ రోజుల్లో రెండు మూడు నెలల్లోనే సినిమాలు పూర్తి చేసి రిలీజ్ చేయగలిగితే తెలుగు సినిమా పరిశ్రమ మళ్ళీ పచ్చగా కళకళలాడుతుంది.