K Viswanathతెలుగు సినిమా స్థాయిని శిఖరమంత ఎత్తులో నిలబెట్టిన కళాతపస్వి దర్శకులు కె విశ్వనాథ్ శాశ్వత సెలవు తీసుకున్నారు. కమర్షియల్ మసాలాలు రాజ్యమేలుతున్న ట్రెండ్ లో శంకరాభరణం లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ తో పండిత పామరులు అనే తేడా లేకుండా అందరు మెచ్చే అద్భుత ఆవిష్కరణ చేయడం ఆయనకే స్వంతం. 1930 ఫిబ్రవరి 5న జన్మించిన విశ్వనాథ్ గారి తల్లి తండ్రులు సుబ్రహ్మణ్యం, సరస్వతి. వీరి పూర్వీకుల స్వస్థలం కృష్ణా నది ఒడ్డున ఉన్న పెదపులివర్రు. బిఎస్సి చేసి పరిశ్రమ మీద మక్కువతో మదరాసు వచ్చి వాహిని స్టూడియోలో ఏ కృష్ణన్ సారథ్యంలో సౌండ్ రికార్డిస్ట్ గా చేరారు. ఆదుర్తి సుబ్బారావు దగ్గర దర్శకత్వ ఓనమాలు నేర్చుకున్నారు.

1951 పాతాళ భైరవితో సహాయ దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన విశ్వనాథ్ గారు 1965 ఆత్మగౌరవంతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ద్వారా తొలిసారి మెగా ఫోన్ చేపట్టారు. మొదటి చిత్రానికే నంది అవార్డు దక్కించుకున్న ఘనతను స్వంతం చేసుకున్నారు. ఆ తర్వాత చెల్లెలి కాపురం, శారద, ఓ సీతకథ, జీవన జ్యోతి లాంటి ఎన్నో సినిమాల ద్వారా కుటుంబ ప్రేక్షకులకు, మహిళలకు బాగా దగ్గరయ్యారు. సెంటిమెంట్ ని పండించడంతో గురువుని మించిన శిష్యుడనిపించుకున్నారు. 1976 సిరిసిరిమువ్వతో తనలోని అసలైన కళాత్మకతను బయటికి తీయడం మొదలుపెట్టారు. నృత్య ప్రధానంగా రూపొందిన ఆ చిత్రం సంచలనం విజయం నమోదు చేసుకుంది.

1980 శంకరాభరణం విశ్వనాథ్ గారికే కాదు టాలీవుడ్ అలోచనా శైలినే గొప్ప మలుపు తిప్పిన చిత్రం. వయసు మళ్ళిన సోమయాజులును హీరోగా పెడితే ఎవరు చూస్తారన్న అనుమానాలు బద్దలు కొడుతూ బ్లాక్ బస్టర్ సాధించారు. చిరంజీవి తొలినాళ్ళలోనే శుభలేఖలో వరకట్నం సమస్యను సున్నితంగా చూపించారు. సప్తపదిలో కులాల మధ్య అంతరాలను ప్రశ్నించారు. 1983 కమల్ హాసన్ తో తీసిన సాగర సంగమం ఒక గొప్ప నృత్యపు వ్యక్తిత్వ వికాస పాఠం. మెగాస్టార్ ని చెప్పుకుట్టేవాడిగా స్వయంకృషిలో చూపించినా, వెంకటేష్ ని పెయింట్లు వేసుకునే వాడిగా స్వర్ణకమలంలో నటింపజేసినా జనం మెచ్చుకునేలా తీయడం ఒక్క విశ్వనాధ్ గారి వల్లే సాధ్యమయ్యింది.

జననీ జన్మభూమి, స్వాతిముత్యం, సిరివెన్నెల, సూత్రధారులు, ఆపద్బాంధవుడు, స్వాతికిరణం ఇవన్నీ ఎప్పటికీ వాడిపోని వెండితెర కుసుమాలు. హిందీలో తన సినిమాలే తొమ్మిది రీమేక్ చేసి అక్కడా ముద్ర వేశారు విశ్వనాథ్. 1995 శుభసంకల్పంతో తనలో నటుడిని పరిచయం చేశారు. పదిహేనేళ్లకు పైగా సంతోషం, కలిసుందాం రా లాంటి సినిమాల్లో ఎన్నో గొప్ప పాత్రలు పోషించారు. దర్శకుడిగా చివరి చిత్రం శుభప్రదం, యాక్టర్ గా గత ఏడాది కన్నడలో వచ్చిన ఒప్పంద. అయిదు జాతీయ అవార్డులు, ఏడు నంది పురస్కారాలు, పది ఫిలిం ఫేర్లతో పాటు ప్రతిష్టాత్మక పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య, దాదా సాహెబ్ ఫాల్కే గౌరవాలను అందుకున్నారు. 92 సంవత్సరాల ఈ కళాసేవకుడు స్వర్గానికేగినా ఆ సినిమాలు మాత్రం ఎప్పటికీ అమృతకలశాలే.