Superstar Rajinikanth Wife Latha Rajinikanth Faces Backlash in the Courtసౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. ఓ దుకాణం అద్దె పెంపును వ్యతిరేకిస్తూ ఆమె వేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. కేసు వివరాల్లోకి వెళ్తే, లతా రజనీకాంత్ కు ఆళ్వార్ పేటలో కార్పొరేషన్ కేటాయించిన దుకాణం ఉంది. ఇందులో ట్రావెల్స్ సంస్థను నడుపుతున్నారు. గత జూన్ వరకు నెలకు 3,702 మాత్రమే అద్దె వసూలు చేస్తూ వచ్చారు.

గత జూన్ 23వ తేదీన దుకాణం అద్దెను చెన్నై కార్పొరేషన్ 21,160కి పెంచింది. ఈ నేపథ్యంలో పాత నోట్లు రద్దు, జీఎస్టీ వంటి సమస్యలతో ట్రావెల్స్ వ్యాపారం తీవ్రంగా దెబ్బతిందని… ఈ పరిస్థితుల్లో చెన్నై కార్పొరేషన్ అద్దెను పెంచడం తమకు భారంగా మారిందంటూ ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తాము కార్పొరేషన్ కు విన్నవించినా, వారు పట్టించుకోలేదని తెలిపారు. అద్దె పెంపు ఉత్తర్వులను రద్దు చేయాలంటూ కోరారు.

ఈ పిటిషన్ సోమవారం నాడు విచారణకు వచ్చింది. కార్పొరేషన్ తరపున న్యాయవాది టీసీ గోపాలకృష్ణన్ వాదిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ జీవో 92ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసులు దాఖలయ్యాయని… కానీ, వాటిని సుప్రీంకోర్టు కొట్టి వేసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న జడ్జి లతా రజనీకాంత్ పిటిషన్ ను కొట్టివేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.