laljibhai-patel-fake-media-rumours-6000-crores-news-govtగుజరాత్ లోని సూరత్ కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి లాల్జీ భాయ్ పటేల్ తన వద్దనున్న 6 వేల కోట్ల రూపాయల విలువైన పెద్ద నోట్ల మొత్తాన్ని స్వచ్చందంగా ప్రభుత్వానికి అప్పగించేసారన్న వార్త జాతీయ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై లాల్జీకి అనుకూలంగా అన్ని మీడియాలు కధనాలు ప్రసారం చేసాయి. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందంటే… ఇవన్నీ ఫేక్ న్యూస్… నమ్మవద్దని స్వయంగా లాల్జీ భాయ్ పటేలే మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పారు.

గతంలో మోడీ ధరించిన సూట్ ను రికార్డు రేటుకు కొనుగోలు చేసిన లాల్జీకి దేశభక్తి ఎక్కువని పాయింట్ ను తీసుకుని, మీడియా లాల్జీపై సింపతీ చూపిస్తూ కధనాలను ప్రచారం చేసింది. దీంతో అవాక్కైన లాల్జీ, “ఇది ఎలా పుట్టుకొచ్చిందో తెలియదు గానీ, ఒక్క పైసా కూడా తానూ ప్రభుత్వానికి ఇవ్వలేదని, ప్రస్తుతం హల్చల్ చేస్తున్నవన్నీ ఒట్టి పుకార్లేనని” తేల్చిపారేసారు. దయచేసి ఇలాంటి పుకార్లను షేర్ చేసుకోవద్దని, అధికారికంగా వ్యక్తమైన విషయాలను మాత్రమే పరిగణించాలని అధికారులు కూడా కోరుతున్నారు.

నిజానికి లాల్జీ 6 వేల కోట్లు అప్పచెప్పినట్లు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో, ఈ వార్తపై చాలా మంది సందేహాలు వ్యక్తపరిచారు. అంత పెద్ద మొత్తం అప్పగిస్తే… అది ఖచ్చితంగా ప్రభుత్వ విజయంగా భావించి, అధికారిక ప్రకటన తెలియజేస్తారన్న ఒక చిన్న పాయింట్ ను మీడియా వర్గాలు మరిచిపోవడంతో లాల్జీ పేరు ప్రధానంగా వినపడింది. ప్రస్తుతం అందరి భ్రమలు తొలగినట్లే..!