lakshmis-ntr-trailer-talk-rgv-takes-lakshmi-parvathi--sideవివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ కాసేపటి క్రితం రిలీజ్‌ అయింది. 1989 ఎన్నికలలో ఎన్టీఆర్‌ దారుణంగా ఓడిపోయిన అనంతరం ఆయన జీవితంలో జరిగిన పరిస్థితులు.. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ఎలా వచ్చారు.. ఎలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకున్నారు అది టీడీపీలో ఎలాంటి పరిణామాలకు దారి తీసింది అనేదే ఈ సినిమా.

ఈ ఘటనలకు సంబంధించి రెండు రకాల వాదనలు జనాలలో ఉంది. ఒకటి నందమూరి – నారా కుటుంబం చెప్పేది… ఇంకొకటి లక్ష్మి పార్వతి చెప్పేది. ప్రజలు మొదటి వాదననే నమ్మరు అని చరిత్ర చెబుతుంది. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఈ సినిమాలో లక్ష్మి పార్వతి చెప్పిన వాదననే చిత్రీకరించారు. నమ్మితేనే కదా మోసం చేసేది అంటూ మొదలైన ట్రైలర్‌ ‘నా మొత్తం జీవితంలో చేసిన ఒకేఒక తప్పు వాడిని నమ్మడం’అంటూ ముగుస్తుంది. దీనిబట్టి రాము ఏం చెప్పాలనుకుంటారో తేలికగా అర్ధం అవుతుంది.

ఎన్టీఆర్ 1989 ఎన్నికలలో ఓడిపోయాక కుటుంబం పట్టించుకోలేదని ఆ సమయంలో ఆయన ఆత్మకథ రాస్తా అంటూ ఆయన జీవితంలోకి వచ్చి ఆయనకు సేవలు చేసి లక్ష్మి పార్వతి దగ్గరయినట్టు రాము చూపించారు. ఎన్టీఆర్ ను ఒంటరిని చెయ్యడానికి కావాలనే ఆమె పార్టీ లో కలగచేసుకుంటున్నారని పత్రికలలో రాయించి, కుటుంబాన్ని ఆమెకు కొడుకు పుడితే ఇబ్బంది అంటూ భయపెట్టి దూరం చేసారని లక్ష్మి పార్వతి తరచూ చెప్పే విధంగానే తీశారు వర్మ. అయితే ఆయన తెలివిగా ట్రయిలర్ లో ఎక్కడా చంద్రబాబు పేరుగానీ ఎన్టీఆర్ కుటుంబసభ్యుల పేరుగానీ ఎత్తకుండా న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్త పడ్డారు అని గమనించాలి.

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఈ చిత్రం అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారనుంది. వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు చెందిన ఒక నాయకుడు నిర్మాతగా ఉండటంతో ఇది మరింత ముదిరే అవకాశం ఉంది. మరోవైపు బాలయ్య తీసిన ఎన్టీఆర్ మహానాయకుడు ఈ నెల 22న విడుదల కాబోతుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల తేదిని మాత్రం నిర్మాతలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే కోర్టు వివాదాలలో ఉన్న ఈ సినిమాకు మునుముందు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో చూడాలి.