Lakshmis- NTR stopped by Censor boardవిశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్‌ జీవితంలోని చివరి రోజుల గురించి లక్ష్మి పార్వతి దృక్కోణం నుండి దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తీసిన వివాదాస్పద సినిమా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. ఈ నెల 22న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఏపీలో ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడును దోషిగా చూపించే ఈ సినిమా విడుదల చేయడం సబబు కాదని తెదేపా కార్యకర్త దేవిబాబు చౌదరి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

దాంతో సినిమాను ప్రస్తుతానికి నిలిపివేయాలంటూ సెన్సార్‌బోర్డు చిత్రబృందాన్ని ఆదేశించింది. ఏపీలో ఎన్నికలు పూర్తయిన తర్వాత సినిమాను విడుదల చేసుకోవచ్చని సూచించింది. దీనితో ఈ సినిమా విడుదల ప్రస్తుతానికి ఆగిపోయినట్టే. దీనిపై తాజాగా ట్విటర్‌ ద్వారా వర్మ స్పందిస్తూ.. సెన్సార్‌ బోర్డుపై కేసు పెడతానని, సినిమా విడుదల కోసం న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. త్వరలో కడపలో ఓ బహిరంగ సభలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ఆడియో వేడుకను నిర్వహించనున్నట్లు వర్మ శనివారం వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు సినిమా వాయిదా పడటం వల్ల ఆ బహిరంగసభ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. వైఎస్సాఆర్ కాంగ్రెస్ నాయకుడు రాకేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. దీనితో ఈ సినిమా మీద వివాదాలు మరింత ముదిరాయి. ఎన్నికల వల్లే ఈ సినిమా కు హైప్ వచ్చింది. ఎన్నికల తరువాత విడుదల అంటే సినిమాకు ఇబ్బంది అనే చెప్పుకోవాలి. ఎన్నికల కోడ్ వచ్చే వరకు విడుదల చెయ్యకుండా ఆలస్యం చేసినందుకు గానూ వారు ఇప్పుడు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది.