Lakshmi-Parvathi-jaganజగన్ ప్రభుత్వం ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు అందరికంటే ముందు ఎన్టీఆర్‌ అర్దాంగినని చెప్పుకొని గుర్తింపు పొందుతున్న లక్ష్మీ పార్వతి ఖండిస్తారని అందరూ ఆశించారు. అయితే వైసీపీలో కొనసాగుతున్నందున కనీసం అది సరికాదని చెపుతారని అందరూ ఎదురుచూశారు. వారం రోజులు తర్వాత తాపీగా ఇవాళ్ళ మీడియా ముందుకు వచ్చి ‘జగన్ అలా చెప్పడం చాలా కన్విన్సింగ్‌గా ఉందంటూ…’ చెప్పడం చూసి అందరూ షాక్ అవుతున్నారు.

హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “హెల్త్ యూనివర్సిటీ స్థాపించింది ఎన్టీఆర్‌గారే కానీ దానికి ఆపేరు పెట్టింది మాత్రం చంద్రబాబు నాయుడు. టిడిపి రాకమునుపు కాంగ్రెస్‌ హయాంలో వైఎస్ఆర్ వైద్య రంగానికి ఎంతో సేవ చేశారు. ఆరోగ్యశ్రీ వంటి గొప్ప పధకం తెచ్చిన మహనీయుడు ఆయన. ఇప్పుడు ఆయన కుమారుడు సిఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో అనేక మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. ఈవిదంగా వైద్యరంగానికి ఎక్కువ మేలు చేసింది వైసీపీయే గనుక ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి మా తండ్రిగారి పేరు పెడుతున్నామని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం చాలా కన్విన్సింగ్‌గా ఉంది. పేరు మార్చడం వలన ఎన్టీఆర్‌గారి ప్రతిష్ట ఏమీ తగ్గిపోదు,” అని లక్ష్మీ పార్వతి అన్నారు.

లక్ష్మీ పార్వతి ఉనికికి, మనుగడకి సూత్రధారి ఎన్టీఆర్, ఆయన పేరే తప్ప వైసీపీ, దాని అధినేత జగన్మోహన్ రెడ్డి కాదని అందరికీ తెలుసు. ఒకవేళ ఆనాడు ఎన్టీఆర్‌ ఆమెను చేరదీయకపోయుంటే నేడు లక్ష్మీ పార్వతి ఎవరో ఎవరికీ తెలిసి ఉండేదేకాదు. తనకు సమాజంలో ఇంత గుర్తింపు ఇచ్చిన ఎన్టీఆర్‌ పేరును తొలగించడం సబబే అని ఆమె చెప్పడం, అందుకు జగన్ చెప్పిన ‘కుంటిసాకు చాలా కన్విన్సింగ్‌గా ఉందని’ లక్ష్మీ పార్వతి చెప్పడం విస్మయం కలిగిస్తుంది.

ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు ఆమెను ఎందుకు దూరంగా పెడుతున్నారో ఇప్పుడు అందరికీ అర్దమయ్యుంటుంది. ఒకవేళ రేపు ఆమె ఏ కారణం చేతైనా వైసీపీకి దూరం అయితే అప్పుడు మళ్ళీ ఎన్టీఆర్‌ పేరు జపిస్తూ మనుగడ సాగించాల్సిందేనని ఆమె గ్రహించారో లేదో?