Lakshmi-Manchu-into-politicsవెండితెరపై, బుల్లితెరపై ఇప్పటికే వివిధ పాత్రలు పోషించిన మంచు వారమ్మాయి లక్ష్మి ప్రసన్న త్వరలో రాజకీయ రంగంలోకి అడుగు పెట్టబోతుందా? అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. తెలుగు ఉచ్చారణలో తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్న మంచు లక్ష్మి ‘స్వరం’ నుండి… అధ్యక్షా అనేందుకు రంగం సిద్ధమవుతోందని, ప్రస్తుతం దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ సిద్ధమవుతోందన్నది ఈ వార్తల సారాంశం.

తెలుగుదేశం పార్టీ తరపున బరిలోకి దింపేందుకు చర్చలు జరుగుతున్నాయని, గతంలో గల్లా అరుణకుమారి విజయం సాధించిన చంద్రగిరి నుండి అసెంబ్లీ స్థానానికి బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో టిడిపి తరపున గట్టిగా మాట్లాడే మహిళా నేత లేకపోగా, వైసీపీలో మాత్రం రోజా పార్టీ అధినేత జగన్ ను మించిన స్వరంతో చెలరేగిపోతోంది. దీంతో చిత్తూరు జిల్లా నుండి బరిలోకి దింపడం ద్వారా రోజమ్మకు చెక్ పెట్టవచ్చనే ఉద్దేశంతో ఈ అడుగులు పడుతున్నట్లుగా టాక్.

అయితే వాస్తవ పరిస్థితులను గమనిస్తే… మంచు లక్ష్మిపై సినీ ప్రేక్షకులలో అంత పాజిటివ్ భావన లేదనే చెప్పాలి. నటిగా వెండితెరపై చూసే పరిస్థితులు లేకపోవడంతో, బుల్లితెరపై సామాజిక కార్యక్రమాలు చేస్తూ కాలం గడుపుతున్న లక్ష్మిని టిడిపి అక్కరకు చేర్చుకుంటే… అంతకు మించిన తప్పిదం మరొకటి ఉండేదేమో అన్న భావన పార్టీ వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది. అయితే ఒక్క మంచు లక్ష్మినే కాకుండా, మోహన్ బాబు కూడా టిడిపి జెండా పట్టుకోవచ్చన్నది అసలు టాక్.