jayalalitha-karunanidhiరాజకీయ సన్యాసం చేసిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తాజాగా తమిళనాట ఓటర్ల నాడిపై సర్వే చేయించారు. ఇతర సర్వేల కంటే కాస్తంత భిన్నంగా ఉన్న ఈ సర్వేలోనూ రాజకీయ కురువృద్ధుడు, డీఎంకే చీఫ్ కరుణానిధినే విజయం వరిస్తుందని తేలిపోయింది. ఈ సర్వే ప్రకారం… రుణమాఫీకి సంబంధించి అధికార అన్నాడీఎంకే కంటే ముందు డీఎంకేనే హామీ ఇచ్చింది గనుక, జయలలిత కంటే ముందుగానే హామీ ఇచ్చిన కరుణానిధి వైపుకే తమిళులు మొగ్గుచూపారని తేలింది.

‘ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్’ విధానానికి ఓటేసిన తమిళ తంబీలు గత అనుభవాలను కూడా ఆ సర్వే సోదాహరణంగా పేర్కొంది. గతంలో ఏపీలో దివంగత సీఎం ఎన్టీఆర్ వినిపించిన 2లకే కిలో బియ్యం పథకానికి ఆకర్షితులైన ఓటర్లు… ఆ తర్వాత అదే హామీని మరో దివంగత సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి ఇచ్చినా దానిని పట్టించుకోలేదు. ముందుగా హామీ ఇచ్చిన ఎన్టీఆర్ వైపే మొగ్గిన ఓటర్లు… 1.95 పైసలకే కిలో బియ్యాన్ని ఇస్తానని చెప్పినా, కోట్లకు ఓటేయని విషయాన్ని ఈ సర్వేలో పేర్కొన్నారు.

రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రుణమాఫీ అస్త్రాన్ని వదిలారు. ఇదే అస్త్రం వైసీపీని విపక్షంలో కూర్చోబెట్టి… టీడీపీకి అధికారం కలేనన్న వాదనను పటా పంచలు చేస్తూ చంద్రబాబును సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ప్రస్తుతం ఏపీ పొరుగు రాష్ట్రం, ప్రాంతీయ పార్టీలకు పెట్టని కోటగా ఉన్న తమిళనాడులో కూడా చంద్రబాబు మంత్రదండమే నిర్ణయాత్మక శక్తిగా మారిందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

మొన్నటివరకు అధికార అన్నాడీఎంకే పార్టీనే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న వాదన వినిపించగా, పోలింగ్ ముగియగానే వెలువడ్డ సర్వేల్లో మాత్రం డీఎంకేదే పైచేయి అని తేలింది. దాదాపుగా అన్ని సర్వేలదీ ఇదే మాట. ఈ క్రమంలో ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు డీఎంకే చీఫ్, ఆ రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కరుణానిధి ఏం మాయ చేశారు? అన్న అంశంపై చర్చ జరుగగా… ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రయోగించిన ‘రుణ మాఫీ’ అస్త్రాన్నే నమ్ముకున్నారని తేటతెల్లమైంది.