Lagadapati Rajagopal reveals about his surveyఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ కాసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చి తెలంగాణ ఎన్నికల నాడి ఎలా ఉంది అనేది మాట్లాడారు. తెలంగాణాలో గెలిచే ఇంకో మూడు ఇండిపెండెంట్ల పేర్లు చెప్పారు ఆయన. ఈరోజుకు ఈరోజు ట్రెండ్ బట్టి హస్తానికి అనుకూలంగా ఉందని ఆయన చెప్పారు. అయితే ఓటింగు శాతం క్రితం సారి (68.5% 2014 ఎన్నికలలో) కంటే తగ్గితే తెరాసకు అనుకూలం, కరెక్టుగా ఉన్నా లేక పెరిగినా మహాకూటమికి అనుకూలమని చెప్పుకొచ్చారు ఆయన. సహజంగా ఇటీవలే పెరుగుతున్న ఓటర్ అవగాహనతో ఓటింగు పెరిగే అవకాశమే ఎక్కువ ఉంది.

ఈసారి ఎన్నికలలో 8-10 ఇండిపెండెంట్లు గెలుస్తారని, బీజేపీకి గతంలో కంటే ఎక్కువ రావొచ్చని, ఎంఐఎం తన ఏడు స్థానాలు నిలబెట్టుకుంటుందని చెప్పుకొచ్చారు. దీనిబట్టి దాదాపుగా 95 సీట్లలోనే తెరాస, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండొచ్చని తెలుస్తుంది. అలాగే ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్ లో కూటమి ఆధిక్యంలో ఉందని చెప్పారు. అదే విధంగా తెరాస వరంగల్, నిజాంబాద్, మెదక్ జిల్లాలలో తన పట్టు చూపిస్తుంది. కరీంనగర్, మహబూబ్ నగర్ హోరాహోరీగా ఉండబోతుంది.

హైదరాబాద్ లోని 14 సెగ్మెంట్లలో 7 ఎంఐఎం నిలబెట్టుకుంటుండగా మిగతా ఏడు బీజేపీ, తెరాస, కూటమి మధ్య సమానంగా వెళ్లపోతున్నాయి. కూటమికి అనుకూలంగా ఉన్న జిల్లాలను పరిశీలిస్తే కాంగ్రెస్ టీడీపీ పొత్తు పని చేసిందనే చెప్పుకోవచ్చు. దానితో పాటు కాంగ్రెస్ తన కంచుకోటాలను కూడా నిలబెట్టుకుంటుంది. తెరాసకు అనుకూలంగా ఉన్న జిల్లాలను పరిశీలిస్తే సహజంగా ఎప్పుడు ఉండే జిల్లాలు ఆ పార్టీ వెనుక ఉన్నాయి. 2014లో వీక్ అనుకున్న చోట్లా ఈసారి బలపడుతుంది అని అంచనా వేసినా అది జరగలేదని లగడపాటి చెప్పారు.

మరొక రకంగా ఇంత మంది ఇండిపెండెంట్లు గెలవడం బీజేపీ సీట్లు పెరగడం అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉందనే చెప్పుకోవాలి. దీనిబట్టి లగడపాటి ఇచ్చిన హింట్లు ఏ రకంగా చూసినా ప్రజకూటమికి అనుకూలంగా ఉంటాయనే చెప్పొచ్చు. అయితే చివరి రెండు రోజులలో ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఎనిమిది నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళి ఓడిపోతే ఇది కచ్చితంగా కేసీఆర్ చేసిన చారిత్రాత్మక తప్పిదమనే చెప్పుకోవాలి. అదే గనుక జరిగితే ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలలో నష్టం జరగడంతో పాటు వచ్చే ఐదు సంవత్సరాలు ఇబ్బంది అనే చెప్పుకోవాలి.