KTR - Lagadapati Rajagopalలగడపాటి రాజగోపాల్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. నవంబర్ 20న తెరాసకు అనుకూలంగా ఉన్న సర్వేను లగడపాటి తనకు పంపారని ఇప్పుడు దానిని చంద్రబాబు కోసం మార్చారని కేటీఆర్ చేసిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆంధ్ర ఆక్టోపస్. సెప్టెంబర్‌ 16న తన బంధువు ఇంట్లో కేటీఆర్‌ కలిశారని… అప్పుడే సర్వే గురించి కేటీఆర్‌ తనను అడిగినట్లు చెప్పారు. సర్వే రిపోర్టులు పంపిస్తానంటే కేటీఆర్‌ మెయిల్‌ అడ్రస్‌ కూడా ఇచ్చారన్నారు. 65 శాతం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని కేటీఆర్‌కు చెప్పానని అన్నారు.

కేటీఆర్‌ 23 నియోజకవర్గాల జాబితా పంపించి సర్వే ఫలితాలు కోరారని, నవంబర్‌ 11న కేటీఆర్‌ మరో 37 నియోజకవర్గాల జాబితా పంపారన్నారు. కేటీఆర్‌ కోరిన 37 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉందని తెలిపారు. నవంబర్ 20న మహాకూటమిలో ఉన్న లుకలుకల వల్ల తెరాసకు అనుకూలంగా ఉందని సర్వే కేటీఆర్ కు పంపిన మాట వాస్తవమే అని లగడపాటి అంగీకరించారు అయితే తరువాత పరిస్థితి మారిపోయిందని చెప్పుకొచ్చారు. నిన్న కొంత మేర గందరగోళంగా చెప్పిన లగడపాటి ఈరోజు మాత్రం క్లియర్ గా మహాకూటమికి అనుకూలంగా ఉందని చెప్పారు ఆయన.

మొన్నటి దాకా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న వరంగల్‌ జిల్లాలో కూడా కాంగ్రెస్‌ ఆధిక్యత ఉందని… ఈ ఉదయమే సమాచారం వచ్చిందన్నారు. పోటాపోటీగా లేనప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కనబడదని అన్నారు. టీడీపీ కాంగ్రెస్ పొత్తు కలిసి వచ్చిందని, తెరాసకు వెళ్ళిపోయిన టీడీపీ ఓటు తిరిగి వచ్చిందని ఆయన చెప్పారు. లగడపాటి తాజా ప్రెస్ మీట్ తెరాసకు ఎక్కువ నష్టం చేసే అవకాశం ఉంది. అయితే ఆయనను ట్విట్టర్ లో రెచ్చగొట్టి కేటీఆర్ ఇది స్వయంకృతాపరాధం అనే అనుకోవాలి. లగడపాటి మీడియాతో మాట్లాడుతుండగా కేటీఆర్ తన ట్విట్టర్ లో కల్లబొల్లి సర్వేలను నమ్మవద్దని, స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణను కాపాడుతుందని చెప్పుకొచ్చారు.

ఎన్నికల్లో గెలుపోటములు సహజమని లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోవద్దని తెలిపారు. కేటీఆర్, తన మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. అయితే తన విశ్వనీయత మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చెయ్యడం వల్లే మీడియా ముందుకు వచ్చి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈరోజు సాయంత్రంతో తెలంగాణాలో ప్రచారం ముగిసిపోతుంది. 7వ తారీఖున పోలింగ్… 11న ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఆరోజు ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది తేలిపోనుంది.