Lagadapati Rajagopal Reacts to his failed surveyఆంధ్ర ఆక్టోపస్ గా పేరుగాంచి ఖచ్చితమైన సర్వేలకు మారుపేరైన లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఎన్నికలలో దారుణంగా దెబ్బ తిన్నారు. ఆయన చెప్పిన జోస్యం అచ్చు తప్పుగా మిగిలిపోయింది. మహాకూటమి అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పగా రికార్డు మెజారిటీతో తెరాస తిరిగి అధికారంలోకి వచ్చింది. దీనితో మొట్టమొదటి సారిగా లగడపాటి తప్పులో కాలేసినట్టు అయ్యింది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలలో సర్వత్రా ఆయన గురించే జరుగుతుంది.

ఈ క్రమంలో లగడపాటి రాజగోపాల్‌ కుటుంబ సమేతంగా శనివారం తిరుపతి వచ్చారు. తిరుచానూరు పద్మావతీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆయన సర్వేకు వ్యతిరేకంగా రావడంపై స్పందించాలంటు మీడియా ఆయన వెంట పడింది. చివరికి ఆయనను పట్టుకుని సర్వే ఫెయిల్ కావడంపై మీడియా ప్రశ్నించగా ‘నో కామెంట్‌’ అంటూ అక్కడ నుండి ఇంకేమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు.ఈ సర్వేతో అభాసుపాలవ్వడంతో ఏపీలో వచ్చే సంవత్సరం మే లో జరగనున్న ఎన్నికలకు లగడపాటి సర్వే చేయిస్తారో లేదో చూడాలి.

2014 రాష్ట్ర విభజన అనంతరం రాజకీయ సన్యాసం చేశారు లగడపాటి రాజగోపాల్. రాజకీయాలకు దూరంగా ఉన్నా తనకు ఉన్న ఇంట్రెస్ట్ ప్రకారం వివిధ ఎన్నికలపై సర్వేలో నిర్వహిస్తూ వస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన తరచుగా సర్వేలు చేయించి ఆ రిపోర్టులు పంపుతారని సమాచారం. తెలంగాణ ఎన్నికల సర్వే తప్పడంతో ఆయన తన సర్వేలతో చంద్రబాబును ఏమైనా తప్పు దారి పట్టిస్తున్నారా అని టీడీపీ వర్గాలలో అనుమానాలు తలెత్తుతున్నాయి.