Lagadapati Rajagopal-KCR -Uttam Kumarతెలంగాణా ఎన్నికలలో ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యి ఉంది. అభ్యర్థుల, పార్టీల తలరాత 11వ తారీఖున తేలబోతుంది. లగడపాటి రాజగోపాల్ వంటి వారు ఓటింగు శాతం ఆధారంగా తమ సర్వే ఫలితాలు చెప్పారు. అయితే ఇప్పటిదాకా ఈసీ దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. ఈరోజు ప్రధాన వార్త పత్రికలు ఒక్కొకటి ఒక్కోరకంగా చెప్పుకొచ్చాయి. దీనితో ఓటర్లు మరింత అయోమయానికి గురి చేశారు. ఈనాడులో 69.1% అని, ఆంధ్రజ్యోతిలో 75% అని, ప్రజాశక్తి 70%+ అని, ఆంధ్రప్రభ 72% అని, వార్త 70%+ అని చెప్పుకొచ్చాయి.

లగడపాటి నిన్న తన సర్వే ఫలితాలు చెప్పేటప్పుడు పోలింగ్ 72%కి తగ్గదు అనే దానిని తీసుకుని చెప్పారు. ఓటింగ్ ప్రామాణికంగానే తన సర్వే ఉంటుందని ఆయన గతంలోనే చెప్పారు. దీనితో పోలింగ్ శాతం మీద అందరికీ ఆసక్తి ఉంది. 2014 ఎన్నికలప్పుడు 67.5% ఓటింగు నమోదు అయ్యింది. అత్యధికంగా ఆదిలాబాద్ లో ఎక్కువ ఓటింగు నమోదు అయితే అత్యల్పంగా హైదరాబాద్ లో నమోదు అయ్యింది. నియోజకవర్గాల వారీగా అత్యధికంగా ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో 91.27 శాతం ఓటింగ్‌ నమోదయింది.

అత్యల్ప పోలింగ్‌ రాజధాని పరిధిలోని మలక్‌పేటలో జరిగింది. ఇక్కడ కేవలం 40 శాతం మంది మాత్రమే ఓటేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి భారీగా ఓట్లు గల్లంతయ్యాయి అనే కంప్లయింట్లు వచ్చాయి. ఇటువంటి ప్రతి ఎన్నికలప్పుడు ఇటువంటి కంప్లయింట్లు సహజమే అయినా ప్రతిసారి మీదా ఈసారి ఎక్కువ. కారణం కేసీఆర్ ముందస్తుకు వెళ్ళడం వల్ల ఓటర్ల జాబితా సవరణ కంగారుగా పూర్తి చెయ్యడమే. ఈ విషయంలో ఈసీని కచ్చితంగా నిందించాల్సిందే. మరోవైపు వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండలంలోని 183వ పోలింగ్‌ కేంద్రంలో పోలైన ఓట్ల కంటే ఈవీఎం లో ఎక్కువ చూపించడం వల్ల అక్కడ సాంకేతిక సమస్య ఏమైనా తలెత్తిందా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పరిశీలిస్తున్నామని, అవసరమైతే రీపోలింగ్‌ నిర్వహిస్తామన్నారు.