Lagadapati - Rajagopal-ఆంధ్రప్రదేశ్ విషయంలో సర్వేలలో మరోసారి సందిగ్దత కనిపించింది. గత ఎన్నికలు లాగానే టీడీపీ అని కొందరు, వైఎస్సార్ కాంగ్రెస్ అని కొందరు చెప్పుకొచ్చారు. ఎక్కువగా సర్వేలు వైఎస్సార్ కాంగ్రెస్ వైపుకే మొగ్గు చూపడం విశేషం. లగడపాటి, టుడేస్ చాణక్య వంటి ట్రాక్ రికార్డు కలిగిన సంస్థలు టీడీపీ వైపు నిలిచాయి. మెజారిటీ సర్వే సంస్థలు వైకాపా వైపే ఉన్నా ఆ పార్టీలో కలవరం మాత్రం పోవడం లేదు. గడపాటి రాజగోపాల్ ని రెండు రోజులుగా ఆ పార్టీ వారు శాపనార్ధాలే పెట్టేస్తున్నారు

టీడీపీ గెలుస్తుందని చెప్పి తన అనుయాయులతో వైఎస్సార్ కాంగ్రెస్ మీద బెట్టింగు వేయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారని ఆ పార్టీ వారి ఆరోపణ. “బెట్టింగు కోసం లగడపాటి ఇలా చేస్తున్నారని అనుకోవడం లేదు. బెట్టింగు మహా అయితే కొన్ని కోట్లు. ఇందులో లగడపాటి వంటి బిగ్ షాట్ కు వచ్చేది ఏమీ ఉండదు. దాని కోసం ఆయన అలా చేసే అవకాశం లేదు. సర్వేలతో లగడపాటి వార్తలలో ఉండటానికి ఇష్టపడతారు. దానికోసం భారీగా ఖర్చు పెడతారు. తన విశ్వసనీయతను దెబ్బ తీసుకోరు,” అని ఒక విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.

“టీడీపీకి అనుకూలంగా ఇచ్చిన సర్వేకు ప్రతిఫలంగా చంద్రబాబు ఏదో కాంట్రాక్టు ఇచ్చారని సాక్షి ఆరోపణ. లగడపాటి సర్వే ఎన్నికల తరువాత వచ్చింది కాబట్టి దీని వల్ల టీడీపీకి ఎటువంటి ఉపయోగం లేదు. దానికోసం చంద్రబాబు కాంట్రాక్టు ఇచ్చారంటే నమ్మబుద్ది అవ్వదు. ఒకవేళ ఇచ్చిన కొత్త ప్రభుత్వం వస్తే దానిని రద్దు చేస్తుంది. నిజంగా వైకాపా గెలిచే అవకాశం ఉందని సర్వేలో తేలితే వారికి అనుకూలంగా సర్వే ఇచ్చి జగన్ మెప్పు పొందాలని చూడాలి. దీని బట్టి లగడపాటి సర్వే తప్పు అవ్వొచ్చు గానీ ఆయన ఉద్దేశపూర్వకంగా సర్వేను మార్చడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు,” అని వారు అంటున్నారు.