lagadapati rajagopal  Exit poll will come trueరెండు తెలుగు రాష్ట్రాలలో ఈ మూడు రోజులు ఏ ఇద్దరు కలిసినా తెలంగాణ ఎన్నికల ఫలితాల గురించే చర్చించుకుంటారు అంటే అతిశయోక్తి కాదు. అందునా లగడపాటి రాజగోపాల్ చెప్పిన సర్వే గురించే చర్చ. కారణం జాతీయ మీడియా సంస్థలన్నిటికీ భిన్నంగా ఆయన తెలంగాణాలో మహాకూటమి భారీ విజయం సాధిస్తుందని చెప్పడమే. ఖచ్చితమైన సర్వేలకు పెట్టింది పేరు ఆయన దీనితో రాజకీయ వర్గాలు కూడా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలో 2014లో ఆయన ఏం చెప్పారంటే…. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి 18-22 సీట్లు వస్తాయని ఫ్లాష్‌ టీం అంచనా వేస్తే.. 20 సీట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌కు 50-60 సీట్లు వస్తాయని అంచనా వేస్తే.. వాస్తవంగా 63 స్థానాల్లో కారు గెలిచింది. అయితే కాంగ్రెస్‌, ఇతరుల విషయంలో మాత్రం ఆయన అంచనాలు కాస్త తప్పాయి. కాంగ్రెస్‌కు 30-40 సీట్లు వస్తాయని లగడపాటి అంచనా వేశారు. కానీ, అనూహ్యంగా 20 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. 7 నుంచి 9 స్థానాల్లో ఇతరులు గెలుస్తారని అంచనా వేస్తే.. ఏకంగా 15 మంది గెలిచారు.

సీట్ల సంఖ్య కాస్త అటూ ఇటుగా అయినా ఆయన చెప్పిన పార్టీనే ఎప్పుడూ అధికారంలోకి వస్తూ ఉంది. అలాగే ఆంధ్రలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమని జాతీయ మీడియా సంస్థలు చెప్పగా ఆయన స్పష్టంగా టీడీపీకి వందకు పైగా వస్తాయని చెప్పారు. అయితే ఈసారి తెలంగాణ ఎన్నికలు మాత్రం తమ టీంకు అత్యంత క్లిష్టమైన సర్వే అని ఆయన చెప్పుకొచ్చారు. దీనితో అత్యంత క్లిష్టమైన సర్వేలో ఆయన ఫెయిల్ అవ్వాలని తెరాస నాయకులు కోరుకుంటున్నారు. నిన్న ఎన్నికలలో వినియోగించిన ఈవీఎంలు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ లకు చేరాయి.

మరోపక్క ఈసీ 11న జరగబోయే ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఒకవేళ ఆరోజు మహాకూటమి గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో మొదటి సంకీర్ణ ప్రభుత్వంగా చరిత్రపుట్టల్లోకి ఎక్కుతుంది. తెలంగాణ రాష్ట్ర యొక్క మొదటి శాసనసభ పూర్తి కాలం ముగియకముందే కేసీఆర్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు సన్నద్ధంగా లేవని వాటికి అవకాశం ఇవ్వకూడదు అన్న కారణంగా కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి తరుణంలో మహాకూటమి గెలిస్తే అది కచ్చితంగా సెన్సేషన్ అనే చెప్పుకోవాలి. అదే క్రమంలో కేసీర్ చేసిన చారిత్రాత్మక తప్పిదం అని కూడా అనుకోవచ్చు.