Lagadapati rajagopal back into vijayawada politicsరాష్ట్ర ముఖ్యమంత్రి విజయవాడ వేదికగానే పరిపాలన సాగిస్తుండడంతో… బెజవాడలో ఏ చిన్న అంశం తెరపైకి వచ్చినా అది హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పుట్టినరోజు సందర్భంగా వెలిసిన “అనుకూల – ప్రతికూల” బ్యానర్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలకు దారి తీసాయి. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న రాజగోపాల్, త్వరలో అధికార పార్టీ తెలుగుదేశం జెండా పట్టుకోబోతున్నారన్న వార్తలు గత కొన్ని మాసాల క్రితం హల్చల్ చేసాయి.

అయితే ఆ తర్వాత కాస్త సర్దుమనిగిన వాతావరణంలో తాజాగా వెలిసిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి. “సమైక్యాంధ్ర కోసం పోరాటం చేసిన యోధుడు ఈ రాష్ట్ర అభివృద్ధి జరగడం కోసం రావాలి మరల రాజకీయాల్లోకి మా ప్రజానేత” అంటూ లగడపాటికి అనుకూలంగా కొన్ని బ్యానర్లు వేలియగా, “75 వేల రూపాయలను బ్యాంకుల నుండి రుణాలుగా తీసుకుని, బ్యాంకులను ముంచి, కుటుంబం పేరు మీద విదేశాలలో అక్రమ ఆస్తులను కూడపెట్టుకున్న లగడపాటి రాజగోపాల్ గారెకి హార్దిక శుభాకాంక్షలు. కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న సందర్భంగా మరెన్నో వేల కోట్ల రూపాయలను కూడబెట్టుకోవాలని ఆకాంక్షిస్తూ… మీ అభిమానులు…” అంటూ ప్రతికూలంగా మరో బ్యానర్ వెలియడం విశేషం. ఈ బ్యానర్ మధ్యలో “చాలవు… ఇంకా కావాలి…” అనే పదాలు కూడా ఉన్నాయి.

దీనిని గమనించిన లగడపాటి అనుచర వర్గం ఆందోళనకు దిగాయి. సదరు ఫ్లెక్సీలను చించివేసి లగడపాటికి జిందాబాద్ కొట్టారు. దీంతో ప్రెస్ క్లబ్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసారు. విజయవాడ వేదికగా వెలిసిన బ్యానర్లు ఒకప్పుడు నందమూరి కుటుంబాన్ని కుదిపేశాయి. మరి తాజాగా వెలుగుచూసిన ఫ్లెక్సీలు ఎంతటి సంచలనం సృష్టిస్తాయోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.