Lagadapati Rajagopa survey on andhra pradesh politicsముఖ్యమంత్రి చంద్రబాబుతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ శుక్రవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన కుటుంబంలో ఈనెల 27న జరగనున్న శుభకార్యానికి సీఎం చంద్రబాబును లగడపాటి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన లగడపాటి ఫెడరల్‌ ఫ్రంట్‌పై ఇప్పుడేమీ వ్యాఖ్యలు చేయలేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కొద్ది నెలలలో ఎన్నికలకు వెళ్లనుండడంతో ఆయన తాజా సర్వే రిపోర్టును చంద్రబాబుకు అందించినట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్త బయటకు రాగానే తెలుగు తమ్ముళ్లు లగడపాటి పై భగ్గుమన్నారు. కారణం గతంలో లగడపాటి తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సర్వే నివేదికలతో తొడలు కొట్టి ఆ తరువాత భంగపడ్డారు. వారి సంగతి పక్కన పెడితే తెలంగాణాలో మహాకూటమి గెలుస్తుందని చంద్రబాబుని కూడా ఏమార్చారని వారి అనుమానం. అందుకే తెలంగాణ టీడీపీని గత నాలుగేళ్లుగా పట్టించుకోని చంద్రబాబు తన శక్తి మేర ప్రచారం చేశారు. అయితే ఆ తరువాత కనీసం మహాకూటమి పోటీలో కూడా లేకుండా పోయింది.

చంద్రబాబు తెలంగాణ ప్రచారం కేసీఆర్ ని రెచ్చగొట్టింది. ఇప్పుడు ఆయన ఏపీ రాజకీయాలలో వేలు పెడతాం అని బాహాటంగానే ప్రకటించేశారు. ఇప్పటికే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో చర్చలు కూడా జరిపారు. ఎన్నికల వేళ తెలంగాణ నుండి అన్ని రకాల సాయాలు వైకాపాకు అందబోతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. లగడపాటి వల్ల చంద్రబాబుకు ఒక్క కొత్త శత్రువు యాడ్ అయ్యాడని తెలుగు తమ్ముళ్ల ఆక్రోశం. జరుగుతున్న పరిణామాలు కూడా ఆ రకంగా ఉండటంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూడా అదే సర్వేలు నమ్ముకుంటే మొత్తానికి చెడతాం అని వారి అభిప్రాయం. మరోవైపు సర్వే గురించి లగడపాటిని మీడియా వారు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా ఆయన సమాధానం దాట వేశారు. వైకాపా తెలంగాణ సీఎం కేసీఆర్ కు చెందిన ఫెడరల్ ఫ్రంట్ లో చేరడంపై ఆయన అభిప్రాయం అడుగగా.. ఫెడరల్‌ ఫ్రంట్‌పై ఇప్పుడేమీ వ్యాఖ్యలు చేయలేనని ఆయన అన్నారు. ఒక రకంగా ఆయన మీడియాకు ముఖం చాటేశారు అని చెప్పుకోవాలి.