Lagadapati Rajagopa survey on andhra pradesh politicsఆంధ్ర ఆక్టోపస్ గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ సర్వేలు అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజే వేరు. అయితే ఆయన మొట్టమొదటి సారిగా గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఘోరంగా దెబ్బ తిన్నారు. తెరాస సునాయాసంగా గెలిచిన ఎన్నికలలో ఆయన మహాకూటమి గెలుస్తుందని చెప్పారు. దీనితో పరువు పోయింది. తెలంగాణాలో గురి తప్పినా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించి ఆయన సర్వే కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఒకసారి పప్పులో కాలేసిన లగడపాటి ఈసారి కసిగా పని చేస్తున్నట్టు సమాచారం. గతంలో ఒకే సారి సర్వే నిర్వహించే లగడపాటి ఈ సారి రెండు పర్యాయాలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో గతంతో పోలిస్తే ఈ సారి సర్వే శాంపిల్ కూడా ఎక్కువని సమాచారం. దీనితో ఖచ్చితంగా ఈ సారి కరెక్టు ఫలితం చెప్పగలనని ఆయన ధీమాగా ఉన్నారు. ఈసారి గనుక ఆయన సర్వే తప్పితే ఇక ఆయన సర్వేలను పట్టించుకునే వారు కూడా ఉండరు.

ఇప్పటికే ఆయన తన సర్వే ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపినట్టు తెలుస్తుంది. మే 19న తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సర్వే ఫలితాలు వెల్లడిస్తానన్నారు. సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు విడతల పోలింగ్ పూర్తి అయ్యేవరకూ సర్వేలు విడుదల చెయ్యకూడదని కేంద్ర ఎన్నికల కమిషన్ రూల్ ఉన్న సంగతి తెలిసిందే. మే 23న ఎన్నికల కౌంటింగ్ జరిపి అదే రోజు ఫలితాలు వెల్లడి చెయ్యబోతుంది ఎన్నికల సంఘం.