KVP about YS Jaganవారాంతం కార్యక్రమంలో భాగంగా ‘వైఎస్ ఆత్మ’గా భావించే కేవీపీ ఓ టీవీ ఇంటర్వ్యూలో ముచ్చటించిన సందర్భంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడను… మాట్లాడను… అంటూనే పలు అంశాలను ప్రస్తావించారు. “వైకాపా గురించి, ఆ పార్టీ నుంచి జరుగుతున్న ఫిరాయింపుల గురించి, పార్టీ అధినేత జగన్ గురించి తాను ఒక్కమాట కూడా మాట్లాడబోనని, ఈ విషయాలన్నీ మరోసారి మాట్లాడుకుందామని, ప్రస్తుతానికి మీరెంత బలవంతం చేసినా జగన్ గురించి మాట్లాడబోనని” కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించగా, “కేవీపీతో ఇంటర్వ్యూ అంటే జగన్ మోహన్ రెడ్డి గురించి, వైఎస్ రాజశేఖరరెడ్డి గురించిన అంశాలుంటాయని ప్రేక్షకులు అనుకుంటారు. అవి మాట్లాడకుంటే ఎలా?” అంటూ సదరు న్యూస్ ప్రతినిధి తిరిగి స్పందించారు.

“జగన్ మోహన్ రెడ్డి అనే వాడు నా మేనల్లుడండీ… వాడు లేకుండా ఎలా ఉంటానండీ?” అన్న కేవీపీకి మరో కీలక ప్రశ్న ఎదురయ్యింది. ‘అక్రమాస్తుల కేసులో జగన్ దోషని మీరు భావిస్తున్నారా?’ అని అడగగా, ‘కాదండీ… దానికి మీరెవరు? నేనెవరు? దానికి మీకేం హక్కుంది? నాకేం హక్కుంది? జగన్ మోహన్ రెడ్డి దోషా? నిర్దోషా? చెప్పడానికి చట్టాలున్నాయి, కోర్టులున్నాయి. కేసులన్నీ కోర్టు పరిగణనలో ఉన్నాయి. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం, జగన్ మోహన్ రెడ్డికి దోషం అంటడానికి అవకాశం లేదు. కానీ నా అభిప్రాయాన్ని ఏ కోర్టూ పరిగణనలోకి తీసుకోదు” అని కీలక వ్యాఖ్యలు చేసారు.

‘కాంగ్రెస్ పార్టీయే తనపై కేసులు పెట్టించిందని జగన్ ఆరోపిస్తున్నారు కదా?’ అని గుర్తు చేయగా, ‘నేను ఈ టాపిక్ పై మరొక్క మాట కూడా మాట్లాడను. ఇప్పుడు రాష్ట్రం విషయాలు మాట్లాడుకుందాం. ప్రత్యేక హోదా, సమస్యలపై మాట్లాడేందుకే వచ్చాను వాటి గురించి మాత్రమే మాట్లాడండి’ అంటూ బదులిచ్చారు. మీరు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి, మీ వ్యూవర్ షిప్ పెంచుకోవడానికి కాంట్రవర్షియల్ సబ్జెక్టు తీసుకొచ్చి, రామచంద్రరావును కాంట్రవర్షియల్ చేయడానికి, కాంగ్రెస్ పార్టీని కాంట్రవర్షియల్ చేయడానికి, దురదృష్టవశాత్తూ మీరు ప్రయత్నిస్తున్నారు” అని అన్నారు. కొత్త వివాదాలు, చర్చలకు తావిచ్చే అంశాల గురించి అసలు ప్రస్తావించనే వద్దని హితవు పలికారు.

అయినప్పటికీ, జగన్ పార్టీ ఫిరాయింపులు మరియు వైఎస్ మరణం తరువాత కుటుంబ పెద్దగా కేవీపీ, వైఎస్ సన్నిహితులుగా ఉండవల్లి, వట్టి వసంతకుమార్ వంటి నేతలు జగన్ వెంట ఎందుకు వెళ్లలేదు? అన్న ప్రశ్నకు కాస్త అసహనం వ్యక్తం చేసిన కేవీపీ… “నేను మీకు సవినయంగా చేతులు జోడించి చెబుతున్నాను. మీకు నేను చెప్పే లాస్ట్ సమాధానం ఇదే. “రాజీవ్ గాంధీతో ఆశీర్వదించబడిన రాజశేఖరరెడ్డిగారి యొక్క ఆత్మ, కాంగ్రెస్ పార్టీ తోటి ఉండమని మమ్మల్ని నిర్దేశించింది. మేము కాంగ్రెస్ పార్టీలో ఉండటం జరిగింది. దీని మీద మీరు మరిన్ని ప్రశ్నలు అడిగితే నేనింక మాట్లాడను” అంటూ మండిపడ్డారు.