KUSA Character highlighted in Jr NTR Jai Lava Kusa‘యంగ్ టైగర్’ అభిమానులు భారీ అంచనాల నడుమ విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ”కు ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు వచ్చిన విషయం తెలిసిందే. భారీ నెగటివ్ టాక్ ఎలాగైతే లభించలేదో, భారీ పాజిటివ్ టాక్ కూడా రాకపోవడం విశేషం. జై… లవ… కుశ… ఇలా మూడు పాత్రలను పోషించిన ఎన్టీఆర్, ఏ పాత్ర ద్వారా సినిమాను నిలబెట్టారో తెలుసా? సినిమా విడుదలకు ముందు వరకు ‘జై’ పాత్రే కాపాడాలి అని భావించగా, విడుదలైన తర్వాత మాత్రం అనూహ్యంగా ‘కుశ’ హైలైట్ అవుతున్నాడు.

అవును… వినోదం కోరుకునే తెలుగు సినీ ప్రేక్షకులకు ‘రావణ’ రూపంలో ఉన్న ‘జై’ పాత్ర కంటే, రొటీన్ మాస్ యాక్షన్ చేసిన ‘కుశ’ పాత్రే ఎక్కువగా నచ్చుతోంది. ఎందుకంటే… సినిమాలో హాస్యం పండింది ఈ పాత్ర ద్వారానే. ఫస్టాఫ్ లో దొంగగా ఫుల్ ‘ఎంటర్టైన్మెంట్’ను పంచిన కుశ పాత్ర, సెకండాఫ్ లో ‘జై’ గెటప్ లోనూ అదే రీతిలో అలరించి సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ లో ‘కుశ’ చేసిన చేపల ఫైట్ అద్భుతంగా వర్కౌట్ కాగా, సెకండాఫ్ లో ‘జై’ ఇంటి నుండి పారిపోదామని చెప్పే సీన్ బాగా పేలింది.

అవే కాదు, సినిమా ప్రేక్షకులకు బోర్ కొడుతుందనుకున్న సమయంలో… టక్ మని కామెడీ సన్నివేశంతో ప్రేక్షకులను ఒక్కసారిగా నవ్వులలో ముంచెత్తడం ‘కుశ’ క్యారెక్టర్ ను హైలైట్ అయ్యేలా చేసింది. నటన పరంగా విమర్శకులను మెప్పించి, అవార్డులను సొంతం చేసుకునే విధంగా ‘జై’ పాత్ర వర్కౌట్ కాగా, కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి ‘కుశ’నే కీలకం అయ్యాడు. బహుశా ‘కుశ’ పాత్ర ఎంటర్టైన్మెంట్ ను పంచకుంటే, సినిమా టాక్ వేరే విధంగా వచ్చి ఉండేదని చెప్పడంలో సందేహం లేదు.