వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నెలలో అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చెయ్యడంతో అమరావతి రైతులు రోడెక్కారు. ఆ రోజు నుండి ఈరోజు వరకూ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం దీనిపై సంపూర్ణంగా మౌనం వహిస్తున్నారు. ఇప్పటివరకూ ఆయన రైతులకు భరోసా కలిగిస్తూ ఒక్క వ్యాఖ్య కూడా చెయ్యకపోవడం గమనార్హం.
దీనికి తోడు మంత్రులు తలా ఒక మాట అంటూ వారిని క్షోభకు గురిచేస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్టులని, రియల్ ఎస్టేట్ ఏజెంట్లని రకరకాలుగా వేధిస్తున్నారు. మిగతా పార్టీలలో పరిస్థితులు కూడా భిన్నంగా ఏమీ లేవు. దాదాపుగా అన్ని పార్టీలు ప్రాంతాల వారీగా విడిపోయి ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.
తాజాగా టీడీపీ రాయలసీమ నేత ఒకరు సరికొత్త వాదన తెర మీదకు తెచ్చారు. గ్రేటర్ విశాఖ ను రాజధాని గా చేస్తే, కర్నూలు లోక్‌సభ నియోజకవర్గాన్ని కర్ణాటకలో కలపాలని టీడీపీ ఇన్‌చార్జి, సీనియర్ నేత తిక్కారెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమకు హై కోర్టు మాత్రమే ఇవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, విశాఖ అయితే రాజధాని తమకు మరింత దూరం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉంటే అమరావతి లో వుంటాము లేకపోతే కర్ణాటక లో కలపాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా అమరావతి పై రాష్ట్ర ప్రభుత్వం అడిగిన నివేదికను బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రేపు ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది. జీఎన్ రావు కమిటీ రిపోర్టు, బీసిజీ రిపోర్టుని క్రోడీకరించి హై పవర్ కమిటీ తమ తుది నివేదికను ప్రభుత్వానికి ఇస్తుంది. దానిని అసెంబ్లీలో ప్రవేశ పెడుతుంది ప్రభుత్వం.