Kurnoolఆంధ్రప్రదేశ్ లోని మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వీలైనంత దూరంగా ఉండేలా ఉందా? అంటే అవును అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం అమరావతిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును కర్నూలుకు తరలించడంపై తమ పాత్ర ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా తేల్చి చెప్పింది.

రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నరసింహా రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి సమాధానం ఇచ్చారు. హైకోర్టును కర్నూలుకు తరలించడంపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు తమ తమ అభిప్రాయాలను ఏర్పరచుకోవాలని, దీని కోసం ఎటువంటి నిర్ణీత సమయం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఒకవేళ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తే, కర్నూలును లీగల్ కేపిటల్‌గా ఈ మంత్రిత్వ శాఖ గుర్తిస్తుందా? అన్న ప్రశ్నకు కూడా కేంద్రం సూటిగా సమాధానం ఇవ్వలేదు. కేంద్రం స్పందననుబట్టి హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావలసి ఉంటుందని తెలుస్తోంది. అయితే గతంలో హైకోర్టు తరలింపు విషయంలో హైకోర్టు సానూకూలంగా స్పందించలేదు.

పైగా గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయవ్యవస్థతో పూర్తి ఘర్షణ వాతావరణంతో ఉంటుంది. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం తీసుకునే రాజకీయ నిర్ణయాలకు హైకోర్టు ఎంతమేర సహకరిస్తుంది అనేది అనుమానమే. అంటే కర్నూల్ న్యాయ రాజధాని అనే ప్రతిపాదన అటకెక్కినట్టేనా?