kuppam-tekkali-are-targets-for-ysr-congress-whyవచ్చే ఎన్నికలలో వైసీపీ 175 స్థానాలు గెలుచుకోవాలని పదేపదే చెపుతున్న సిఎం జగన్మోహన్ రెడ్డి దాని కోసం భారీ వ్యూహం సిద్దం చేస్తున్నారు. ముందుగా కుప్పం, టెక్కలి నియోజకవర్గాలను టార్గెట్ చేసుకొని ఆ రెండు చోట్ల పూర్తి పట్టు సాధించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

టిడిపి గెలుచుకొన్న 18 నియోజకవర్గాలలో వైసీపీ ఇన్‌ఛార్జ్‌లతో నిన్న జరిగిన సమావేశంలో కూడా ఇదే విషయం స్పష్టం చేశారు కూడా. కుప్పం, టెక్కలిపైనే ప్రధానంగా ఎందుకు ఫోకస్ పెడుతున్నారో తెలిసిందే. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కనుక. వచ్చే ఎన్నికలలోగా వారి నియోజకవర్గాలపై వైసీపీ పట్టు సాధించి ఎన్నికలలో వారిద్దరినీ ఓడించగలిగితే, ఒకవేళ తాము బొటాబోటి మెజార్టీతో అధికారంలోకి వచ్చినా నాయకుడు లేని టిడిపిని సులువుగా చీల్చేసి నిర్వీర్యం చేయవచ్చని బహుశః సిఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లున్నారు.

అయితే తెలుగుదేశం పార్టీ ఇటువంటి ఒడిదుడుకులు ఎన్నో ఎదుర్కొని నిలబడిన పార్టీ. కనుక వచ్చే ఎన్నికలలో ఒకవేళ చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు ఇద్దరూ ఓడిపోయినా టిడిపిని నిర్వీర్యం చేయడం వైసీపీ వల్లకాదనే చెప్పాలి. నిజానికి గత మూడున్నరేళ్ళుగా టిడిపిని నిర్వీర్యం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం చేయని ప్రయత్నమంటూ లేదు. అయినా చేయలేకపోయింది. నేటికీ టిడిపి వైసీపీకి ఎదురోడ్డి పోరాడుతూనే ఉండటమే ఇందుకు నిదర్శనం. కనుక కుప్పం, టెక్కలిలో గెలిచేసి టిడిపిని నామరూపాలు లేకుండా చేసేయాలనే వైసీపీ దురాలోచనలు ఎన్నటికీ సఫలం కావు.

ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలించమని భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గెలిపించారు కనుక ఆయన ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొని ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేసి చూపి ప్రజలను మళ్ళీ ఓట్లు అడిగి ఉంటే వారు తప్పకుండా వైసీపీకే వేసి ఉండేవారు. కానీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే టిడిపిని ఏవిదంగా నిర్వీర్యం చేయాలనే ఆలోచిస్తూ వైసీపీ నేతలు ‘కేవలం రాజకీయాలు మాత్రమే’ చేస్తున్నారు. ఇది వారిలో గూడుకట్టుకొన్న అభద్రతాభావానికి నిదర్శనంగా భావించవచ్చు.

తెలంగాణను అభివృద్ధి చేసి చూపిన కేసీఆర్‌, రాష్ట్ర విభజనతో తీవ్రంగా దెబ్బ తిన్న ఆంధ్రప్రదేశ్‌ని గాడిలో పెట్టి చూపిన చంద్రబాబు నాయుడు ఇంతగా రాజకీయ పోరాటాలు చేయవలసివస్తున్నప్పుడు, అసలు ఏమీ చేయని సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఏవిదంగా మెప్పించగలరు?మళ్ళీ ఎలా అధికారంలోకి రాగలమని నమ్ముతున్నారో అర్దం కాదు. అదీ…. 175కి 175 సీట్లు గెలుచుకొని!