చంద్రబాబు నియోజకవర్గం అయిన కుప్పంతో పాటు ఇతర మునిసిపాలిటీలను కైవసం చేసుకున్న ఆనందంలో మునిగి తేలుతున్నారు వైఎస్సార్సీపీ పార్టీ వర్గాలు. నిజమే… గెలుపు ఎవరికైనా సంతోషాన్ని నింపడం సహజమే! అయితే అది ప్రజాస్వామ్యబద్ధంగా అందుకున్న విజయమా? లేక అధికారంలో ఉండడం వలన మాత్రమే సాధించుకున్న గెలుపా? అన్నది కూడా పార్టీ నేతలు సమాలోచనలు చేసుకోవాల్సిన సమయం ఇది!

1) ప్రజాస్వామ్య గెలుపు – అధికారం చేపట్టి రెండేళ్లు గడిచాయి. ఇంకా ఎన్నికలకు మరో మూడేళ్ళ దాకా సమయం ఉంది కాబట్టి, ఎటువంటి అభివృద్ధి జరగాలన్నా ప్రజలు సహజంగా అధికారంలో ఉన్న పార్టీకే ఓట్లు వేస్తారు, ఇది సర్వసాధారణం, ఇందుకు “గత చరిత్ర” సాక్ష్యంగా నిలుస్తోంది.

ప్రజాస్వామ్య గెలుపు అంటే ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా, తామంతటగా తాము ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా లభించే విజయం. మరి వైసీపీ నిజంగా ఇలాంటి విజయాన్నే సొంతం చేసుకుందో లేదో అన్నది వారికే ఎరుక!

2) అధికారంతో గెలుపు – చేతిలో ఉన్న పవర్ ను వినియోగించుకుని, ప్రభుత్వ అధికారుల సహకారం – డబ్బులు – బెదిరింపులు – రిగ్గింగ్ లు – వాలంటరీ వ్యవస్థతో ప్రజలపై ఒత్తిడి – తద్వారా ఫైనల్ గా విజయాన్ని అందుకోవడం. ప్రతిపక్షాలు అయితే రెండవ మార్గం ద్వారానే వైసీపీ విజయాన్ని అందుకుంది అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు.

సరే రాజకీయంలో ఎవరి వాదనలు వారికుంటాయి కాబట్టి, ‘అధికార – ప్రతిపక్షాలు’ ఎవరికి వారు ప్రత్యర్థి పార్టీని డిఫెన్స్ లోకి నెడుతుంటాయి. కానీ “చరిత్ర”ను ఎవరూ మార్చలేరు. నేడు వైసీపీ ప్రజాస్వామ్య బద్ధంగా గెలిచినా… అధికార దుర్వినియోగంతో గెలిచినా… ఇది మరో మూడేళ్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఏ మాత్రం నిదర్శనం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఎందుకంటే… గతంలో 2017లో జగన్ ఇలాకాలో తెలుగుదేశం పార్టీ కూడా ఇలానే విజయం అందుకుంది. అలాగే అంతకుముందు వైఎస్సార్ హయాంలో కూడా అధికారంలో ఉన్న పార్టీయే స్థానిక సంస్థల ఎన్నికలలో జయకేతనం ఎగురవేసింది. కానీ ఆ తర్వాత ఆయా ప్రభుత్వాలు అధికారాన్ని కోల్పోయిన విషయాన్ని మననం చేసుకుంటూ… ఇది కేవలం వాపు మాత్రమే… బలుపు అనుకుంటే పొరపాటు తప్పదన్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.