kuppam govt school students requested ys jagan for Bus“జగన్ మావయ్య మా ఊరికి బస్సు వేయించవా?” అని కుప్పం నియోజకవర్గంలో చీగలపల్లి విద్యార్థులు అడిగిన వెంటనే సిఎం జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు వేయించేశారని వైసీపీ ట్వీట్ చేసింది. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేని పని సిఎం జగన్ ఒకే ఒక్క నిమిషంలో చేయించేసి కుప్పం ప్రజల కష్టాలు తీర్చేశారని ఆ ట్వీట్ సారాంశం.

అయితే జగన్ సొంత జిల్లా అయిన కడపలో బస్టాండ్ ఎందుకు నిర్మించలేకపోయారనే టిడిపి ప్రశ్నకు వైసీపీ నుంచి ఇంకా జవాబు రావలసి ఉంది. “జగన్ మావయ్య మా ఊరికి బస్సు వేయించవా?” అని విద్యార్థులు అడగగానే బస్సు వేయించేయగలిగినప్పుడు గత మూడున్నరేళ్ళుగా రాష్ట్రంలో గుంతలు పడిన రోడ్లను మరమత్తు చేయించమని ప్రజలు, ప్రతిపక్షాలు పదేపదే అడుగుతున్నా ‘మావయ్య’ ఎందుకు స్పందించడం లేదు?

ఆగస్ట్ 17వ తేదీలోగా రాష్ట్రంలో రోడ్లన్నీ మరమత్తులు చేయించేయాలని హుకుం జారీ చేసినా నేటికీ రాష్ట్రంలో రోడ్లన్నీ గోతులమయంగా ఎందుకు ఉండిపోయాయి?అనే ప్రశ్నకు మావయ్యే సమాధానం చెప్పకపోవచ్చు. కానీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, రోజా లేదా కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి వంటివారు సమాధానం చెప్పొచ్చు కదా?కుప్పం మీదున్న శ్రద్ద రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాలపై లేదనుకోవాలా?ఒకవేళ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం కాకపోయుంటే జగన్ మావయ్య కుప్పంలో అడుగుపెట్టేవారా? బస్సు వేయించేవారా?

ఆ స్థాయి విద్యార్థులు ఎన్నడూ ఇటువంటి ఆలోచనలు చేయరని అందరికీ తెలుసు. కుప్పంలో వైసీపీ నేతలే ఈ డ్రామాను రచించి రక్తి కట్టించి ప్రచారం చేసుకొంటున్నట్లు అర్దమవుతూనే ఉంది. రాజకీయాల కోసం విద్యార్థులను కూడా ఈవిదంగా వాడుకోవడం చాలా దారుణమైన ఆలోచన. ఇందుకు సిగ్గుపడకపోగా ఏదో ఘనకార్యం చేసినట్లు ట్విట్టర్‌లో గొప్పగా చాటుకోవడం సిగ్గుచేటు! ఏది ఏమైనప్పటికీ ‘మావయ్య’ని అడిగితే కాదనడని వైసీపీ గొప్పగా చెప్పుకొంటోంది కనుక “జగన్ మావయ్యా… ఏపీలో రోడ్లేయించవా?” అని ప్రజలు కూడా అడుగుతున్నారు. వేయిస్తారా?