కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు రేపు శనివారం వెలువడతాయి. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్‌కు కాస్త ఆదిక్యత రావచ్చు కానీ బిజెపి నుంచి గట్టి పోటీ ఉన్నందున హంగ్ ఏర్పడే అవకాశం ఉందని సర్వే సంస్థలన్నీ జోస్యం చెప్పాయి. వాటి అంచనాలు నిజమైతే ప్రభుత్వం ఏర్పాటుకు జేడీఎస్ మద్దతు అవసరం పడొచ్చు కనుక కుమారస్వామి ‘కింగ్ మేకర్’ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే కుమారస్వామి పోలింగ్ ప్రక్రియ పూర్తవగానే తమ పార్టీ ఆర్ధిక పరిస్థితి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“మాకు ఎన్నో ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవం ఉంది. కొంతకాలం అధికారంలో కూడా ఉన్నాము. మాకు ప్రజల నుంచి, ‘బయట నుంచి’ పెద్ద ఎత్తున ఆర్ధికసాయం అందుతుందని చాలా ఆశపెట్టుకొన్నాము. నిధుల కోసం చివరి నిమిషం వరకు ఆశగా ఎదురుచూశాము కానీ దురదృష్టవశాత్తు లభించలేదు. ఈసారి ఎన్నికల సమయంలో మా చేతిలో తగినంత డబ్బు లేకపోవడం చేత మేము సులువుగా గెలవగలిగే 25-30 నియోజకవర్గాలలో మా అభ్యర్ధులకు చేయూత అందించలేక వాటిని చేజార్చుకొన్నాము. ఇది మాకు చాలా బాధ కలిగిస్తోంది,” అని కుమారస్వామి అన్నారు.
కుమారస్వామి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ సిఎం కేసీఆర్‌ని ఉద్దేశ్యించి చేసినవేనని మీడియా కోడై కూస్తోంది. కర్ణాటక శాసనసభ ఎన్నికలలో జెడిఎస్, బిఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని, ఈసారి ముఖ్యమంత్రి పీఠంపై కుమారస్వామిని కూర్చోబెడతానని కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు.
అయితే ఆ తర్వాత ఏమయిందో తెలీదు కానీ, బిఆర్ఎస్ సభలకు కుమారస్వామిని పిలవడం మానేశారు. కర్ణాటక ఎన్నికలలో బిఆర్ఎస్ పోటీ చేయలేదు. కనీసం జేడీఎస్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసేందుకు కూడా కేసీఆర్ వెళ్ళలేదు. ఎవరినీ పంపించలేదు. ఆర్ధికసాయం కూడా చేయలేదని కుమారస్వామి తాజా వ్యాఖ్యలతో స్పష్టమైపోయింది.
రెండుపార్టీల మద్య సీట్లు సర్దుబాటు కాకపోవడం వలననే కేసీఆర్ కర్ణాటక ఎన్నికలకు దూరంగా ఉండిపోయారని ఊహాగానాలు వినిపించినప్పటికీ, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చిక్కుకొన్న కూతురు కల్వకుంట్ల కవితను కాపాడుకొనేందుకే ఈ ఎన్నికలకి, కుమారస్వామికి దూరంగా ఉన్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కారణం ఏదైనప్పటికీ కుమారస్వామికి కేసీఆర్ హ్యాండ్ ఇచ్చారనేది వాస్తవం. దానికి జేడీఎస్ మూల్యం చెల్లించుకొంటోంది.