KTR-TRS-YS -Jagan
తెలుగుదేశం పార్టీకి చెందిన సేవ మిత్ర యాప్ కోసం ప్రభుత్వ లబ్ధిదారుల డేటాను చోరీ చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్స్‌ సంస్థ కేసు పెద్ద దుమారమే సృష్టిస్తుంది. ఇది తెరాస ప్రభుత్వం కక్ష సాధింపు చర్య అని టీడీపీ ఆరోపిస్తుంది. అయితే దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ఏపీ ప్రజలకు సంబంధించిన ఓటర్ల వివరాలను తస్కరిస్తోందని ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేస్తే తెలంగాణ పోలీసులు చర్యలు చేపడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.

అసలు ఆంధ్రా పోలీసులకు ఇక్కడ పనేంటి? అని నిలదీశారు. ఫిర్యాదు చేసిన లోకేశ్వరరెడ్డి ఇంటికి వెళ్లి దాడి చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. చేయాల్సిందంతా చేసి తెలంగాణ ప్రభుత్వంపై నెట్టడమేంటి? ఫిర్యాదు దారుడు లోకేశ్వరరెడ్డి విజిల్ బ్లోయర్ అంటూ కితాబు ఇచ్చారు ఆయన… ఏకంగా వికీ లీక్స్ అధినేత ఎడ్వర్డ్ స్నోడెన్ తో పోల్చారు కేటీఆర్. ఈ కేసులో ఇంత విషయం తెలిసిన మంత్రికి లోకేశ్వర రెడ్డి హైదరాబాద్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ ఐటీ సెల్ లో పని చేస్తారని తెలియదా?

అసలు ఏపీ ప్రభుత్వ సమాచారం.. ఏది బయటకు వచ్చిందో.. పోలీసులు ఇంత వరకూ నిర్దారించలేదు. కాకపోతే ఆయన కేసు విచారణను ప్రభావితం చేసేలా ఫిర్యాదుదారుడికి విజిల్ బ్లోయర్ అనే హోదా ఇచ్చేసి తప్పు జరిగిందని నిర్ధారించేశారు. దీనితో ఈ కేసు విచారణపై టీడీపీకి అనుమానాలు ఉండటం సహజమే కదా? లోకేశ్వర రెడ్డి హైదరాబాద్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ ఐటీ సెల్ లో పని చేస్తున్నాడు అనేది ఆయన దాచారు అంటే ఉద్దేశపూర్వకంగా వైకాపాకు రాజకీయ లబ్ది చేకూర్చాలని చూడటమే కదా?