KTR YS Jagan Meet at Lotus Pondకాసేపటి క్రితం లోటస్ పాండ్ లో వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డితో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు నాయకులు మీడియా ముందు మాట్లాడారు. దేశరాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలని సమాఖ్య స్ఫూర్తితో జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చెయ్యడమే లక్ష్యంగా ఇరు పార్టీల వారు కలిసి పని చెయ్యడానికి నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికీ వెళ్లి జగన్‌తో భేటీ అయి మిగిలిన విషయాలను మాట్లాడతారని అన్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, చంద్రబాబు నాయుడును ఓడించడం గురించి ఇద్దరు నాయకులూ ప్రశ్నలు దాట వేశారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి తాము చెప్పాలనుకున్నది చెప్పేసి వారిద్దరూ అక్కడ నుండి వెళ్లిపోయారు. 25మంది ఎంపీలతో ప్రత్యేకహోదా కోసం మేము డిమాండ్‌ చేసినా, పట్టించుకునే పరిస్థితి లేదు. వారికి తోడు తెలంగాణ నుంచి మరో 17మంది ఎంపీలు కూడా జతకూడితే, మొత్తం 42మంది ఎంపీలు ఒకే తాటిపైకి వచ్చి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి పోరాడితే ప్రత్యేక హోదా వస్తుందని జగన్ చెప్పారు.

అదే సమయంలో ప్రత్యేక హోదాకు మద్దతుగా ఇప్పటికే తమ పార్టీ పార్లమెంట్ సాక్షిగా తన స్టాండును చెప్పిందని, అలాగే ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మాట్లాడారని దీనిపై ఎలాంటి మార్పు లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. దీనితో ఏపీ రాజకీయాలలో వేలు పెడతాం అని ఇది వరకే చెప్పినట్టుగా తెరాస నేతలు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. అసలు ఏపీ గ్రౌండ్‌లోకి కేసీఆర్‌ దిగుతారా..? వైసీపీకి మద్దతిస్తూ… గేమ్‌ నడిపిస్తారా..? అసలు ఎలాంటి వ్యూహంతో టీఆర్‌ఎస్‌ వెళ్తోంది..? దానికి టీడీపీ కౌంటరేంటి..?

కేసీఆర్ ఆంధ్ర రాజకీయాలలో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయితే అది టీడీపీకి మేలు చేకూరుస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణాలో చంద్రబాబు ప్రమేయాన్ని తెలంగాణ ప్రజలు ఎలా తిరస్కరించారో ఏపీ ప్రజలు కూడా అలాగే ఆలోచిస్తే జగన్ ఏమైపోతారో? ఇప్పటికే తలసాని వంటి నేతలు ఏపీ వచ్చి టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. కులాల వారీగా ప్రజలను విడదీసి అధికార పార్టీకి వ్యతిరేకంగా తయారు చేసే పనిలో ఉన్నారు. దీనితో రానున్న రోజులలో ఆంధ్ర రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి.