KTR USA Telangana Investmentతెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ బృందం ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది. మొదటి మూడురోజులలోనే సినీ, మీడియా రంగంలో పేరుమోసిన ‘వార్నర్ బ్రదర్స్-డిస్కవరీ’ సంస్థను, వైద్యపరికరాల తయారీలో పేరుమోసిన ‘మెడ్‌ట్రానిక్స్‌’ కంపెనీని, ఏఐ, ఎన్‌ఎల్‌పీ ఆధారిత ఉత్పత్తులలో అగ్రగామిగా ఉన్న ‘జాప్‌కామ్ గ్రూప్’ను, తాజాగా బ్యాంకింగ్, ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో పేరు మోసిన ‘అలియంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ’ల సీఈవో, ప్రతినిధులతో మాట్లాడి హైదరాబాద్‌లో వాటి కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు. వీటిలో ఒక్క ‘అలియంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ’యే హైదరాబాద్‌లో 9,000 మందికి ఉద్యోగాలు కల్పించబోతోంది! మిగిలిన మూడు కంపెనీలు కలిపి మరో 3-4,000 ఉద్యోగాలు కల్పించబోతున్నాయి!

కేవలం మూడు రోజుల పర్యటనలోనే నాలుగు అమెరికన్ కంపెనీలను హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి పెట్టి వేలమందికి ఉద్యోగాలు కల్పించేలా చేసుకొన్నారు. కేటీఆర్‌ బృందం అమెరికా పర్యటన ముగిసేలోగా తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని కంపెనీలు, పెట్టుబడులు సాధించడం ఖాయమే. తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రోత్సాహాకాలను మాత్రమే చూసి అమెరికన్ కంపెనీలు ఆ రాష్ట్రంలో వేలకోట్లు పెట్టుబడి పెడుతున్నాయనుకోలేము. అవి అక్కడ పెట్టుబడి పెట్టి ఐ‌టి కంపెనీలు, పరిశ్రమలు స్థాపిస్తున్నాయంటే అర్దం… తెలంగాణలో మంచి వ్యాపారావకాశాలు, వ్యాపారానికి అనుకూలమైన పరిస్థితులు, మంచి రాజకీయ వాతావరణం కూడా ఉన్నాయని భావిస్తున్నాయని స్పష్టం అవుతోంది. తెలంగాణ ప్రభుత్వ విధానాలు (పాలసీలు) అద్భుతంగా ఉన్నాయని గ్రహించేందుకు ఈ వరుస పెట్టుబడులే ఓ నిదర్శనమని చెప్పుకోవచ్చు కూడా!

ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో కలుషిత రాజకీయ వాతావరణం, రాజకీయ అస్తిరత, రాజధాని విషయంలో తీవ్ర అనిశ్చిత, విద్యుత్‌ కొరత, ఇంకా అనేక సమస్యలు ఉన్నందున, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ సాహసించడం లేదు. కనీసం పరిశ్రమలు, పెట్టుబడులను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కూడా కనబడదు. పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించడంలో ప్రయత్నలోపం ఏపీ ప్రజల పాలిట శాపమనే భావించవచ్చు.

హైదరాబాద్‌లో వందల పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, వాణిజ్య సంస్థలు ఉన్నప్పటికీ ఆ రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ఏటా తన బృందంతో విదేశాలలో పర్యటిస్తూ రాష్ట్రానికి ఇంకా ఇంకా పెట్టుబడులు, సంస్థలు తెచ్చుకొంటూనే ఉంటారు. కానీ ఏపీ రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎల్లప్పుడూ టిడిపి, జనసేనలతో రాజకీయ యుద్ధాలు చేస్తూ కనబడుతుంటారు.

విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఏపీలో రూ.13.56 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయులు చేసుకొన్నామని చెప్పుకోవడమే తప్ప అవి నిజంగా వస్తాయనే నమ్మకం లేదు. ఏపీలో ఈ కలుషిత రాజకీయవాతావరణం చూస్తూ ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సాహసిస్తారా?అంటే అనుమానమే.

ఏపీలో నెలకొన్న ఈ దుస్థితే తెలంగాణ రాష్ట్రానికి వరంగా మారిందని చెప్పవచ్చు. మంత్రి కేటీఆర్‌ బృందం చాలా తెలివిగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొంటూ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు సంపాదించుకొంటోందని చెప్పవచ్చు. అందుకు వారిని చూసి అసూయ పడవలసిన అవసరం లేదు. మన బంగారం నకిలీదైతే కంసాలిని నిందించి ఏం ప్రయోజనం?