KTR says KCR is greater than NTRకేంద్ర బడ్జెట్‌ లో రెండు తెలుగు రాష్ట్రాలకు దక్కింది ఏమీ లేదు. దీనిపై విమర్శలు వస్తున్న తరుణంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెదవి విరిచారు. రాష్ట్ర విజ్ఞప్తులను కేంద్రం పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ఈ రెండు పథకాలకూ రూ.24 వేల కోట్లు ఇవ్వాలని గతంలో నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసిందనీ, అయితే కేంద్రం 24 రూపాయలు కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో కనీసం ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసినప్పటికీ, రాష్ట్ర ప్రాజెక్టులను కేంద్రం విస్మరించిందని కేటీఆర్‌ ట్విట్టర్‌లో ప్రస్తావించారు. ఐదేళ్లు పూర్తయినా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదని పేర్కొన్నారు. అయితే ఇది ఇలా ఉండగా కేంద్ర బడ్జెట్ పై ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించలేదు. ఆ పార్టీ వారు నిరాశ వ్యక్తం చేసినా జగన్ దాని మీద మౌనం వహించడం గమనార్హం.

నిజానికి మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణకు కేంద్రం నిధులు ఇస్తుందని ఎవరూ ఆశించలేదు. అయితే రాజకీయంగా రాష్ట్రంలో బలపడాలని చూస్తున్న బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ దీనిపై స్పందించారు. అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలా కాదు. లోటు బడ్జెట్ తో సతమతం అవుతున్న రాష్ట్రానికి కేంద్ర సాయం ఎంతో అవసరం. విభజన చట్టం ప్రకారం కూడా రాష్ట్రానికి రావాల్సింది ఎంతో ఉంది అయినా ముఖ్యమంత్రి దీని మీద స్పందించకపోవడం ఏంటని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.