KTR - trolled on social media on hyderabad rainsమంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. గంటల తరబడి దంచికొట్టిన వానతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. రోడ్లు నదులను తలపించాయి. రాత్రంతా కరెంటు లేకపోవడంతో చాలామంది నిద్రలేని రాత్రులు గడిపారు. చాలా మంది ఇళ్లలోకి నీరు చేరడంతో ఇళ్లపైకి చేరుకొని రాత్రంతా గడిపారు.

నిన్న ఉదయం అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… గతంలో ప్రభుత్వాలు హైదరాబాద్ ను ఏ విధంగానూ అభివృద్ధి చెయ్యలేదని… తమ హయాంలో విశ్వనగరం దిశగా హైదరాబాద్ వడివడిగా అడుగులు వేస్తుంది అని చెప్పిన కొన్ని గంటలలో ఇలా కకావికలం కావడం విశేషం. మరోవైపు… కేటీఆర్ కే చెందిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

హుధుద్ సమయంలో వైజాగ్, వరదల సమయంలో చెన్నై… బెంగళూరులో ఐటీ కంపెనీలు పని చెయ్యకుండా పోతే హైదరాబాద్ లోని వారే బండి ముందుకు నడిపించారని… దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే క్వాలిటీ అఫ్ లివింగ్ లో హైదరాబాద్ ముందుంది అని ఒక కార్యక్రమంలో కేటీఆర్ అంటున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఇదేనా క్వాలిటీ అఫ్ లివింగ్ అని ఆయా నగరాల వారితో పాటు హైదరాబాద్ ప్రజలు కూడా ప్రశ్నించడం గమనార్హం. జీహెచ్ఎంసి ఎన్నికల ముందు ఇటువంటి వానలు రెండు మూడు పడితే తెరాస ఆ ఎన్నికలలో చాలా గడ్డు పరిస్థితి ఎదురుకోవాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.