KTR-TRS-Telangana-TRS-Comments-on-Chandrababu-Naiduతెరాస మహాకూటమి మధ్య హోరాహోరీగా జరుగుతున్న ఈ ఎన్నికలలో గ్రేటర్ పరిధిలో ఉన్న నియోజకవర్గాలే గెలుపోటములను నిర్ణయిస్తాయని విశ్లేషకుల అంచనా. ఇక్కడి తెరాస అభ్యర్థుల గెలుపు బాధ్యతలను మంత్రి కేటీఆర్‌ తారకరామారావుకు పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ అప్పగించారు. దాంతో కేటీఆర్‌ అన్నీ తానై నగరంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో గ్రేటర్ ఎన్నికలలో కూడా ఆయనే పార్టీకి సారథ్యం వహించి రికార్డు గెలుపు తెచ్చి పెట్టారు. ఆ వేవ్ లో టీడీపీ, కాంగ్రెస్ లు అప్పట్లో తుడిచిపెట్టుకుపోయాయి.

అయితే 2014లో మహానగరంలో మూడు స్థానాల్లో మాత్రమే టీఆర్‌ఎస్‌ గెలిచిన నేపథ్యంలో ఈసారి ఎక్కువ స్థానాలపై దృష్టి పెట్టారు. అపద్ధర్మ డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఎంఐఎం బరిలో ఉన్న ఏడు నియోజకవర్గాలు మినహా ఇతర చోట్ల దాదాపుగా కేటీఆర్‌ రోడ్‌షో, సమావేశాలు పూర్తయ్యాయి. టీఆర్‌ఎ్‌సకు మద్దతుగా సీమాంధ్రులు నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లోనూ పాల్గొంటున్నారు. పలు కులసంఘాలు నిర్వహించిన వనభోజనాలకు కూడా హాజరు అవుతున్నారు.

ఇక్కడ గనుక తెరాసకు ఘనవిజయం లభించి అధికారంలోకి వస్తే ఆ క్రెడిట్ అంతా కేటీఆర్ కే వెళ్లి తదుపరి ప్రభుత్వంలో ఆయన అత్యంత శక్తివంతంగా మారతారు. ఇప్పటికే ఆయన పార్టీలో ప్రభుత్వంలో నెంబర్ 2 గా కొనసాగుతున్నారు. తెరాసకి భారీ మెజారిటీ వస్తే కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతారు అని పుకారు కూడా బాగా ప్రచారంలో ఉంది. దీనిని కేటీఆర్ ఖండించినప్పటికీ అది జరగకూడదు అనేదానికి బలమైన కారణాలు ఏమీ కనిపించడం లేదు.

అయితే కాంగ్రెస్ టీడీపీ జతకట్టడం, గ్రేటర్ పరిధిలో చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం చెయ్యడంతో ఇక్కడ ఈసారి తెరాస గెలుపు అంత తేలికేమీ కాకపోవచ్చని అందరూ అనుకుంటున్నారు. టీడీపీకి తెలంగాణాలో భవిష్యత్తు లేదు అనుకుని ఆ పార్టీ ఓటర్లు గ్రేటర్ ఎన్నికలలో పెద్దగా ఉత్సాహంగా పాల్గొనలేదు. కాంగ్రెస్ తో పొత్తుతో మళ్ళీ క్రియాశీలంగా టీడీపీ అవతరించడంతో ఆ వర్గం ఓటర్లు మళ్ళీ టీడీపీ వైపు చూస్తున్నారని సమాచారం. దీనితో గ్రేటర్ పోరు రసవత్తరంగా సాగబోతోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ భవిష్యత్తు ఎటు అనేది సెట్లర్ల మీదే ఆధారపడి ఉంటది అనేది అతిశయోక్తి కాదు.