KTR Target 2020వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కేటీఆర్‌ ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. అత్యధికంగా 24 నియోజ‌క‌వ‌ర్గాలున్న హైదరాబాద్ నే టార్గెట్ గా పెట్టుకుని పని మొదలు పెట్టారు. గ‌త ఎన్నిక‌ల్లో మల్కాజిగిరి, సికింద్రాబాద్, పటాన్ చెరు నియోజకవర్గాల్లో మాత్రమే టీఆర్‌ఎస్‌ విజ‌యం సాధించింది. అయితే ఎనిమిది మంది టీడీపీ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరడం, బల్దియా ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో తెరాస ఇక్కడ బలపడింది.

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో 24 నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. ఇందులో ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంఐఎం ప్రాతినిధ్యం వ‌హిస్తోంది. ఎంఐఎంతో పొత్తు లేకపోతే కనీసం 20 నియోజకవర్గాలు గెలిచేలా వ్యూహరచన చేస్తున్నారు. ముస్లిం వర్గాలకు ప్రకటిస్తున్న రకరకాల తాయిలాలతో ఎంఐఎం కంచుకోట్లను బద్దలు కొట్టడం పెద్దగా కష్టం కాబోదని గులాబీ నేతల అంచనా.

అయితే గ్రేటర్ లో తెరాస కు ఇబ్బందులు లేకపోలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి 99 మంది కార్పొరేట‌ర్లు గెలిచారు. అయితే చాలామంది వివాదాల్లో ఇరుకున్నారు. ప్రజలతో కూడ సంబంధాలు పెద్దగా లేవ‌నే విమ‌ర్శలు కూడా వినిపిస్తున్నాయి. గ్రేట‌ర్‌లో మంత్రులున్నా, వారు పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో వారు చేసింది ఏమి లేదనే అభిప్రాయం ఉంది.

కావున డైరెక్ట్ గా కేటీఆర్ రంగంలోకి దూకారు. వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. స్థానిక నాయకులతో సమీక్షలు జరుపుతున్నారు. మొత్తంగా వచ్చే ఎన్నిక‌ల నాటికి హైద‌రాబాద్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెర‌వేర్చి గ్రేట‌ర్ లో మెజారిటీ సీట్లు కైవ‌సం చేసుకోవాల‌న్న ప‌క్కా వ్యూహంతో టీఆర్‌ఎస్‌ ముందుకెళుతోంది.