ktr-scheme-for-500-1000-notesపాత 500, 1000 రూపాయల నోట్లపై ప్రజలు మదన పడుతున్న వేళ, తెలంగాణా మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన స్కీం మంచి ఫలితాలను అందిస్తోంది. వచ్చే అయిదు సంవత్సరాల వరకు అన్ని ప్రభుత్వ పన్నులను పాత నోట్లతో చెల్లించుకోవచ్చు, అయితే ఇది ఈ ఒక్క రోజు మాత్రమే అని చెప్పడంతో ప్రజలు మీ సేవా కేంద్రాలకు క్యూలు కట్టారు. ఎంతగా క్యూలు కట్టారు అంటే… ప్రభుత్వ అధికారులే అంచనా వేయలేని విధంగా!

ప్రభుత్వ కార్యాలయాలు ఓపెన్ చేసిన ఒక్క గంటన్నర్రలోనే 5 కోట్ల రూపాయలు వసూలు కావడం విశేషం. సాధారణంగా డ్యూ డేట్ గడిచినా పన్నులు కట్టని వారంతా ఇపుడు గంటలు గంటలు క్యూలో నిలబడి మరీ చెల్లింపులు చేస్తున్నారు. అది కూడా… బకాయిలు కట్టడంతో పాటు… అడ్వాన్సుగా వచ్చే అయిదేళ్ళకు పన్నులు చెల్లిస్తున్నారు. దీంతో కేటీఆర్ ప్రతిపాదన అదిరింది… రికార్డు స్థాయిలో రెవిన్యూ వసూలు అవుతోంది అంటూ అధికారులు చెప్తున్నారు.

జీహెచ్ఎంసీలో దాదాపు 24 సర్కిల్ కార్యాలయాల్లో జరుగుతున్న ఈ పన్ను వసూలు మధ్యాహ్నం సమయానికే 12 కోట్లకు చేరుకుంది. అలాగే ఈ రోజు రాత్రి 12 గంటల వరకు చెల్లింపులు కొనసాగనుండడంతో, పన్ను వసూళ్ళల్లో దేశంలో నెంబర్ 1 స్థానంలో హైదరాబాద్ నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు. కేవలం ప్రభుత్వాలకు చెల్లించే పన్నుల కోసమే ఇన్ని నోట్ల కట్టలు దుమ్ము దులిపితే, అసలు ఇంకెన్ని కట్టలు దాగి ఉన్నాయో అన్న సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది.