KTR  says TRS supports Andhra Pradesh Special Statusరాష్ట్రం ఏర్పడి ఐదేళ్లవుతున్నా కొన్ని మీడియా సంస్థలు తెలంగాణపై ఆధిపత్య ధోరణితో వార్తలు రాస్తున్నాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. వార్తాపత్రికల తెలంగాణ ఎడిషన్లలో స్థానిక వార్తలే ఉండాలన్నారు. కొన్ని పత్రికలు తెలంగాణ అస్తిత్వాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఇలాంటి డ్రామాలు ఎక్కువ రోజులు నడవవని, దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణ అస్తిత్వానికి ఇబ్బంది ఏర్పడితే జర్నలిస్టులంతా ఇటువైపే నిలబడాలని సూచించారు.

తెలంగాణ భావజాలం కలిగిన పత్రికలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. అయితే కేటీఆర్ మాట్లాడిన ఈ మాటలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వారి లోటస్ పాండ్ ఇంట్లో కలిసి ఫెడరల్ ఫ్రంట్ లో చేరమని అడిగాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం తాము ఇప్పటికే వాగ్దానం చేశామని, దానికి కట్టుబడి ఉన్నామని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

జగన్ మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు ఆంధ్రకు ఉన్న 25 మంది ఎంపీలతో ప్రత్యేక హోదా సాధించలేకపోయాం కాబట్టి భవిష్యత్తులో తెరాస తో కలిసి ఆ సంఖ్యను 42 కు పెంచుకుని సాధిస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు వస్తున్న ప్రశ్న ఏంటంటే తమ పత్రికలలో ఆంధ్ర వార్తలనే భరించలేని వారు ఆంధ్రకు స్పెషల్ స్టేటస్ కోసం పోరాడతారా? స్పెషల్ స్టేటస్ అనేది ఆంధ్రప్రదేశ్ కు ఇస్తే అది తెలంగాణకు నష్టమే. గతంలో ఆ విషయం పై కేసీఆర్ తో సహా అనేక తెరాస నేతలు చెప్పారు. ఇటీవలే ఎన్నికలప్పుడు కూడా అవే మాటలు చెప్పారు.

అవన్నీ గతమని ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఇరు పార్టీలు కలిసి ఫెడరల్ ఫ్రంట్ లో కేంద్రంతో పోరాడతామని వైఎస్సాఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి నేతలలో పాత వాసనలు ఇంకా పోలేదని కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలతో తేటతెల్లం అవుతుందని టీడీపీ నాయకులు అంటున్నారు. మరో వైపు గతంలో మీడియా ను దారికి తెచ్చుకునేందుకు టీవీ9, ఆంధ్రజ్యోతి ఛానెళ్లను చాలా కాలం తెలంగాణాలో బ్యాన్ చేశారు. ఇప్పుడు మరో సారి అటువంటి చర్యలకు ఏమైనా దిగుతారా?