KTR_SakshiNews_Investment_Telangana_Stateతెలంగాణ రాష్ట్రంలో అమెజాన్ వెబ్‌ సర్వీసస్ 2019లో రూ.20,096 కోట్లు పెట్టుబడితో మూడు భారీ డేటా సెంటర్స్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌, హెచ్ఐసీసీలో నిన్న జరిగిన ‘ఏడబ్ల్యూఎస్ ఎంపవర్‌మెంట్ ఇండియా’ సమావేశంలో రాబోయే 8 ఏళ్లలో మరో రూ.16,204 కోట్లు పెట్టుబడి పెట్టి వాటిని దశలవారీగా విస్తరించబోతున్నట్లు అమెజాన్ వెబ్‌ సర్వీసస్ ప్రకటించింది. అంటే ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే అమెజాన్ వెబ్‌ సర్వీసస్ సంస్థ ఒక్కటే పెట్టిన పెట్టుబడి రూ.36,300 కోట్లు అన్న మాట! ఇంకా మైక్రోసాఫ్ట్ వంటి అనేక అంతర్జాతీయ కంపెనీలు పెట్టిన, పెట్టబోతున్న పెట్టుబడులకి లెక్కే లేదు. మిగిలిన పత్రికలతో పాటు వైసీపీ అధికారిక పత్రిక సాక్షి మీడియా కూడా ఈ వార్తని ప్రచురించింది! ఇతర దేశాలే కాదు… చివరికి ఏపీకి చెందిన అమర్‌రాజా బ్యాటరీస్ కూడా తెలంగాణలో రూ.9,500 కోట్లు పెట్టుబడి పెడుతోంది.

అయితే ఏపీకి ఏడాదికి సగటున రూ.15,000 కోట్ల పెట్టుబడులు సాధిస్తున్నామని అదే చాలా గొప్ప విషయమన్నట్లు రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పుకోవడం విశేషం. తన సాటి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ దావోస్ సదస్సుకి వెళ్ళి అప్పుడే తన రాష్ట్రానికి వేలకోట్లు పెట్టుబడులు సంపాదించుకొన్నారు. కానీ మన ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి “మనం దావోస్ వెళ్ళకపోయినా నష్టం లేదు… జగనన్నని చూసి పెట్టుబడిదారులే ఏపీకి క్యూకడుతున్నారని” చెప్పుకోవడం విస్మయం కలిగిస్తుంది.

ఏపీ, తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రులు గుడివాడ అమర్నాథ్ రెడ్డి, కేటీఆర్‌ల పనితీరును పోలుస్తూ నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్ చాలా ఆలోచింపజేస్తున్నాయి. పొరుగు రాష్ట్ర మంత్రి దావోస్ వెళ్ళి తన రాష్ట్రానికి పెట్టుబడులు సాధించుకొంటుంటే, మన రాష్ట్ర మంత్రి ఎంతసేపూ చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లని విమర్శించడానికే పరిమితం అవుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం ఐ‌టి, పారిశ్రామిక రంగాలలో శరవేగంగా అభివృద్ధి సాధిస్తుంటే, ఏపీలో ఉన్న పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు మూసుకొని పొరుగురాష్ట్రాలకి తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వైసీపీ ఆత్మసాక్షి కూడా ఎప్పటికప్పుడు రిపోర్టింగ్ చేస్తూనే ఉంది. అయినా వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టిన్నట్లు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏపీలో అభివృద్ధి అంటే సంక్షేమ పధకాలే అన్నట్లు మంత్రులు వాదిస్తుంటారు. తమ శాఖల గురించి మాట్లాడకుండా ఎంతసేపు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లని విమర్శించడానికి లేదా మూడు రాజధానుల భాగోతం వినిపించడానికి… ఇంకా చెప్పుకోవాలంటే రోడ్లపై డ్యాన్సులు చేస్తుండటమే కనిపిస్తోందని నెటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.