KTR - Revanth Reddyతెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదంటారు అయితే పార్టీలు అన్నీ తెలుగుదేశం ఓట్లు కోసం ఆరాటపడటం విశేషం. నిన్న హుస్సేన్ సాగర్ ఆక్రమణల గురించి మాట్లాడుతూ అక్బరుద్దీన్ ఒవైసీ ఎన్టీఆర్ ఘాట్, పీవీ ఘాట్లను పగలగొట్టాలని పిలుపునిచ్చారు. దానికి అన్ని పార్టీల వారు పోటీ పడి ఎన్టీఆర్, పీవీల మీద ప్రేమ కురిపించడం విశేషం.

ఎన్టీఆర్ ఘాట్, పీవీ ఘాట్ల జోలికి వస్తే నీ దారుస్సలాం పగలగొడతాం అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చి… ఈరోజు ఎన్టీఆర్ ఘాట్, పీవీ ఘాట్లను సందర్శించడం విశేషం. పైగా ఎన్టీఆర్ కు భారత రత్న ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం అంటూ ఆయన ప్రకటించడం విశేషం.

అక్బర్ ఆ వ్యాఖ్య చెయ్యగానే… “మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గార్లపై ఈ రోజు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఇరువురు నాయకులు కూడా తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదు,” అంటూ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చి వారి ఘాట్లను సందర్శించి పీవీ, ఎన్టీఆర్ లకు భారత రత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ లేకపోయినా, టీడీపీ పని అయిపోయింది అన్నా ఇంకా పార్టీలు టీడీపీ ఓట్ల కోసం వెంపర్లాడడం విశేషం.