KTR says KCR is greater than NTRమంగళవారం హైదరాబాద్ ను మరోసారి వర్షం తడిసిముద్దచేసింది. లోతట్టు ప్రాంతాలను జలమయం చేసింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి ఆఫీసుల నుండి ఇళ్ళ కు వెళ్లే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు. చాలా మంది అర్ధరాత్రి వరకూ ఆఫీసులలోనే ఉండిపోయారు. ఎన్నో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

వందేళ్ల తర్వాత సెప్టెంబర్‌లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. అంకితభావంతో నగరంలో సహాయకచర్యల్లో పాల్గొంటున్న సిబ్బందికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నిజమే వర్షం భారీగానే కురిసింది. అయితే ఇది అంతా ప్రకృతి వైపరీత్యమేనా అంటే పూర్తిగా కాదనే చెప్పుకోవాలి.

నగరంలో అద్వాన్న స్థితిలో ఉన్న రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ వల్ల పరిస్థితి మరింత జటిలం అవుతుంది. ఒక మాదిరి వానకే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఏలిన వారు మాత్రం వర్షం పడ్డప్పుడు సహాయక చర్యలతో మాత్రమే సరిపెడుతున్నారు. కేటీఆర్ మంత్రి అయిన తొలినాళ్లలో హైదరాబాద్ రూపురేఖలు మార్చే 100 రోజుల ప్రణాళిక అంటూ ఊదరగొట్టారు.

అప్పటి బల్దియా ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. అయితే ఉన్న డబ్బంతా ఓట్ల కోసం సంక్షేమ కార్యక్రమాలకు మళ్ళించి హైదరాబాద్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. చరిత్రలో ఇంత అద్వాన్నంగా రోడ్లు ఎప్పుడూ లేవు అంటే ఎటువంటి సందేహం లేదు. భారీ వర్షం కురిసినప్పుడల్లా ఇంతకు ముందెన్నడూ లేని వర్షం, 100 ఏళ్ళ లోనే ఎక్కువ వర్షం అంటూ వంకలు చెబుతున్నారు. మరో వందేళ్ళయినా ఇదే వంక చెబుతారా?