KTR Responds On Karnataka Elections 2023 Resultsరాజకీయాల్లో ఎవరి పంథా వారిదే.. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన శైలి ఉంటుంది. కొందరు భాష,యాస లతో జనాలను ఆకట్టుకుంటే, మరికొందరు పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ లతో ఆకట్టుకుంటారు. ఇంకొందరు సైలెంట్ గా మాట్లాడుతున్నట్లే మాట్లాడుతూ సెటైర్లు పేలుస్తారు. వీరి ప్రసంగాలు వినే జనం మాత్రం విజిల్స్ వేస్తూ స్పీచ్ లకి మరికొంత ఊపునిస్తారు.

దేశవ్యాప్తంగా మంచి వాగ్ధాటి ఉన్న నాయకుల్లో కేటీఆర్ కూడా ఒకరు. తెలంగాణ భాష,యాస తో పాటు హిందీ, ఆంగ్ల భాషల్లో కూడా జనరంజకమైన ప్రసంగాలు చేయడంలో కేటీఆర్ దిట్ట. ఆయన ప్రసంగాలు చాలా వైవిధ్యభరితంగా ఉంటాయి కూడా. కేటీఆర్ మాట్లాడుతుంటె చిన్నా పెద్దా తేడాలేకుండా నోళ్ళు వెళ్ళబెట్టుకుని వినే పరిస్థితి.

అయితే కేటీఆర్ తాజాగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఆయన స్టైల్ లో కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలుపుతూనే.. కాస్త చురకలు అంటించారు. దీంతో ఒక్కసారిగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఒకింత చర్చనీయాంశం అయ్యాయి.

కర్ణాటక ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు సాధించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో బీజేపీ పై ఘాటు విమర్శలే చేశారు. నీచమైన విభజన రాజకీయాలు చేసే బీజేపీ పార్టీకి గట్టిగా బుద్ది చెప్పిన కర్ణాటక ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు.

ఎన్నికల్లో ప్రభావం చూపించి నీచ రాజకీయాలు చేయడానికి బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహరించిందని కేటీఆర్ అన్నారు. “ది కేరళ స్టోరీ” ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలని అనుకున్నారని, కానీ ఆ ఎఫెక్ట్ కర్ణాటక ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయిందని కేటీఆర్ అన్నారు. ఓ పక్క బీజేపీపై విమర్శలు చేస్తూనే.. మరో పక్క కాంగ్రెస్ శ్రేణులకు చురకలు అంటించారు.

“ది కేరళ స్టోరీ ” ఏ విధంగా అయితే కర్ణాటక ప్రజలపై ప్రభావం చూపించలేకపోయిందో, అదే విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ పై ఏ మాత్రం ప్రభావం చూపవని కేటీఆర్ అన్నారు. కర్ణాటకను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని, మౌళిక వసతుల కల్పన, పెట్టుబడులను ఆకర్షించడంలో హైదరాబాద్, బెంగళూరు ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. దేశానికి మంచి చేసేలా రెండు నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఓ పక్క కర్ణాటకలో విజయ ఢంకా మ్రోగించిన కాంగ్రెస్ కి శుభాకాంక్షలు చెప్తూనే , అక్కడి ఎన్నికల ప్రభావం తెలంగాణ పై ఎంత మాత్రం ఉండదు అనే వ్యాఖ్యలతో టి.కాంగ్రెస్ నాయకులకు భలే చురకలు అంటించారు.. ఏదైనా కేటీఆర్ స్టైలే వేరు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.