KTR on andhra pradesh roads and power- cutsఒక రాష్ట్రం గొప్పదనం, ఆ రాష్ట్రంలో పరిస్థితులు తెలియాలంటే ఆ రాష్ట్రంలోనే పర్యటించాలి కానీ తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ తమ ప్రభుత్వం, తమ పరిపాలన, తమ రాష్ట్రం అభివృద్ధి, గొప్పదనం తెలుసుకోవాలంటే పక్క రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్‌)లో నాలుగు రోజులు పర్యటించి రావాలని చెప్పడం విశేషం.

క్రెడాయ్ అధ్వర్యంలో హైదరాబాద్‌, హెచ్ఐసీసీలో జరిగిన ప్రాపర్టీ షోలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, “నా స్నేహితుడు ఒకాయన ఉన్నాడు. అతనికి పక్క రాష్ట్రంలో ఇళ్ళు, తోటలు ఉన్నాయి. సంక్రాంతికి తన ఊరు వెళ్ళి హైదరాబాద్‌ తిరిగి రాగానే నాకు ఫోన్‌ చేసి, నేను అక్కడ నాలుగు రోజులు ఉన్నాను. అక్కడ కరెంట్ లేదు..నీళ్ళు లేవు…రోడ్లన్నీ ధ్వంసం అయిపోయున్నాయి. హైదరాబాద్‌ తిరిగిరాగానే సొంత ఇంటికి చేరుకొన్నట్లు హాయిగా ఊపిరి పీల్చుకొన్నాను అని చెప్పాడు. ఆయనే ఓ సలహా కూడా ఇచ్చాడు. మీరు ఓ నాలుగు బస్సులు వేసి మన వాళ్ళని పక్క రాష్ట్రానికి పంపించి అక్కడ తిరిగి రమ్మనమని చెప్పండి. అక్కడ పరిస్థితులు వారు కళ్ళారా చూసి వస్తేగానీ మన ప్రభుత్వం ఎంత గొప్పగా పనిచేస్తోందో వారికి అర్ధం కాదు,” అని చెప్పాడు.

సాధారణంగా పొరుగు రాష్ట్రం గురించి మంత్రి హోదాలో ఉన్నవారెవరూ ఈవిదంగా మాట్లాడరు. కానీ చాలా ఆచితూచి మాట్లాడే కేటీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ దుస్థితి గురించి ఈవిదంగా మాట్లాడరంటే ఆయన చెప్పినవన్నీ వాస్తవం కనుకనే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినప్పుడు, మాజీ సిఎం చంద్రబాబు నాయుడు పదేపదే ఒక మాట చెప్పేవారు. “కీచులాడుకోవడం, బురద జల్లుకోవడం కాదు అభివృద్ధిలో పోటీ పడదాం. రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో ఏది అభివృద్ధి చెందుతుందో చూపిద్దాం…” అంటుండేవారు. ఆయన హయాంలో అందుకోసం చాలా గట్టి ప్రయత్నాలే చేసి సత్ఫలితాలు రాబట్టారు కూడా.

అయితే నడిచొచ్చే కొడుకుకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామని ప్రజలనుకోవడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఎనిమిదేళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకొంటే ఏపీ పరిస్థితి ‘ఎక్కడున్నావే గొంగళీ అంటే వేసిన చోటే పడున్నాను అన్నట్లుండగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి ఈ పోటీలో విజయం సాధించింది.

ఇందుకు అనేక కారణాలున్నాయని అందరికీ తెలుసు. అయితే రాజకీయ ద్వేషంతో గత ప్రభుత్వం చేపట్టిన రాజధాని అమరావతితో సహా అన్ని పనులను పక్కనపడేసి మళ్ళీ కొత్త పాట అందుకొని రాజకీయ కక్ష సాధింపు, సంక్షేమ పధకాలనే రెండు ప్రధాన లక్ష్యాలుగా పాలకులు ముందుకు సాగుతుండటమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే పరిపాలించుకోవడం చేతకాదనుకొన్నవారు కూడా నేడు మనల్ని చూసి ఈవిదంగా నవ్వగలుగుతున్నారు. అది వారి తప్పు కాదు స్వయంకృతాపరాధమే.