KTR on andhra pradesh politicsఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తప్పకుండా వేలు పెడతాం, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అని తెరాస నేతలు బహిరంగంగానే ప్రకటించే వారు. కేటీఆర్ స్వయంగా వెళ్లి జగన్ ని కలిసొచ్చారు. అయితే ఇది బెడిసికొట్టడంతో జగన్ ను కేసీఆర్ కలుస్తారు అని కేటీఆర్ ప్రకటించినా ఆ విషయంలో వెనుకడుగు వేశారు. తెర వెనుక నుండి మాత్రమే వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు ఎపి రాజకీయాలలో తమకు ఎలాంటి పాత్ర లేదని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ అద్యక్షుడు కేటీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

“అక్కడి రాజకీయాల్లో మా పాత్ర ఏమీ లేదు. తెరాసకు ఒక పార్టీగా ఏపీలో వేలుపెట్టాల్సిన అవసరం, పరిస్థితి, ఆసక్తి లేదు. తెదేపా, వైకాపా, జనసేనలతో ఏపీలో త్రిముఖ పోటీ ఉంది. ఆ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు, ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబును సాగనంపే ఆలోచనలో ఉన్నారు. ప్రజలను గోల్‌మాల్‌ చేసి ఓట్లు పొందాలని చూస్తున్నారు,” అని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పుడు ఎవరిని గెలిపించాలనేది ప్రజల నిర్ణయం అంటూ తప్పుకున్నారు కేటీఆర్.

అదే సమయంలో చంద్రబాబు మీద నిప్పులు చెరిగారు. “ఎవరైనాన అయిదేళ్లు సీఎంగా పనిచేసి ఉంటే తాను చేసింది చెప్పాలి. మళ్లీ గెలిపిస్తే ఏం చేస్తామో చెప్పాలి. పాజిటివ్‌ ఓటు కోసం యత్నించాలి. మేం శాసనసభ ఎన్నికల్లో అదే చేశాం. మేం ఏపీ ప్రజలు, తెలంగాణ ప్రజలు అని ఎక్కడా వేర్వేరుగా చూడలేదు. వారి ప్రయోజనాల విషయంలో ఏనాడూ ఆటంకాలు కల్పించలేదు. అందరు బాగుండాలనుకున్నాం. మమల్ని బూచిగా చూపించి గెలవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఎవరిని గెలిపించాలనేది ప్రజల నిర్ణయం,” అని అన్నారు కేటీఆర్.