KTR - Mohammad Azharuddinప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ కాంగ్రెస్ లోనే ఉన్నా ఈ మధ్య కాలంలో పెద్దగా యాక్టీవ్ గా లేరు. ఆయన ఉన్న ఫలంగా తెరమీదకు వచ్చి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలలో పోటీ చేశారు. అధ్యక్షుడిగా సునాయాసంగా గెలిచారు. గెలిచిన వెంటనే ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను కలుసుకోబోతున్నారు. దీంతో ఇక తెరాసలో చేరడం పక్కా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రతిష్టాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నిక నేపధ్యంలో కాంగ్రెస్ నుంచి కొందరిని చేర్చుకుని ఆ పార్టీని నైతికంగా దెబ్బతీయాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా అజారుద్దీన్ ని తీసుకువచ్చే బాధ్యత ఇటీవలే పార్టీలో చేరి మంత్రైన సబితా ఇంద్రారెడ్డికి కేసీఆర్ అప్పగించారంట

కాగా అజారుద్దీన్ ముఖ్యమంత్రిని పొగుడుతూ … కేసీఆర్‌ను రాష్ట్రానికి బాస్‌గా అభివర్ణించారు. తెరాసల్లో చేరికపై ప్రశ్నించగా.. రాజకీయాలకు ఇది సందర్భం కాదని వ్యాఖ్యానించారు. 2018 ఆఖరులో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలోనే అజారుద్దీన్ పార్టీని వీడి తెరాసలో చేరతారని వార్తలు వచ్చాయి. చివరికి అలా జరగలేదు.

ఇప్పటికే కాంగ్రెస్ నుండి మూడింట రెండింతల ఎమ్మెల్యేలను లాక్కుని ఆ పార్టీకి శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా రాకుండా చేశారు. ఇప్పుడు ఆ పార్టీ బలం ఎంఐఎం కంటే తక్కువగా పడిపోయింది. దీనితో సహజంగా ప్రధాన ప్రతిపక్షానికి దక్కాల్సిన పీఏసీ చైర్మన్ పదవి కూడా ఎంఐఎంకే కట్టబెట్టారు. ప్రధాన ప్రతిపక్షానికి దక్కే ఏకైక కేబినెట్ హోదా పదవి పీఏసీ చైర్మన్ పదవి.